Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజల్ని నూతన కళారూపాలతో కవులు, కళాకారులు చైతన్యపర్చాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆర్థిక నేరాలను, మతోన్మాదాన్ని పెంచుతున్నదనీ, ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు సీపీఐ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ''పల్లె పల్లెకు సీపీఐ-ఇంటింటికీ సీపీఐ'' కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా జానపద గేయాలు, ఒగ్గుకథలు, వీధినాటకాలను రూపొందించుకోవాలని సూచించారు. అభ్యుదయ రచయితల సంఘం, తెలంగాణ ప్రజానాట్య మండలి సంయుక్త రాష్ట్ర సమితి సమావేశం మంగళవారం హైదరాబాద్లోని మగ్ధూంభవన్లో జరిగింది. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ.. తొమ్మిడేండ్ల మోడీ పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ దిగజారిందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీని, ప్రధాని మోడీని ఎక్కుపెడుతూనే, స్థానిక సమస్యలను జోడిస్తూ కొత్త రకమైన పాటలతో ముందుకు సాగాలని కవులు, కళాకారులకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, లౌకిక వ్యవస్థ పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం సీపీఐ యాత్ర కొనసాగనున్నదని చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ మాట్లాడుతూ.. అరసం, ప్రజానాట్య మండలి కలిసి ఒక శక్తివంతమైన పాటలను తీసుకురావాలన్నారు. అరసం అధ్యక్షవర్గ సభ్యులు వేల్పుల నారాయణ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాడులకు పాల్పడుతున్నారని, వివక్షకు గురికావాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి ప్రజా నాట్యమండలి కార్యదర్శి పల్లె నర్సింహ సభాధ్యక్షత వహించగా, ప్రజా నాట్య మండలి అధ్యక్షులు కె.శ్రీనివాస్, అరసం కార్యదర్శి రాపోలు సుదర్శన్, అరసం కార్యదర్శి కెవీఎల్తో పాటు కవులు,కళాకారులు పాల్గొన్నారు.