Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ఎంసీ నిబంధనలు సంతృప్తి చెందేలా పనులు ఉండాలి : మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల పనులు వేగంగా కొనసాగించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేయనున్న తొమ్మిది మెడికల్ కాలేజీలు, నిమ్స్‌పై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలు సంతప్తి చెందేలా పనులుండాలని సూచించారు. జూలై నాటికి తరగతులు ప్రారంభించేందుకు వీలుగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు భర్తీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు. 2014 తర్వాత ఎంబీబీఎస్ సీట్లు దేశంలో 71 శాతం పెరిగితే, రాష్ట్రంలో 240 శాతం పెరిగాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలకు అనుమతించిన కేంద్రం తెలంగాణపై వివక్ష చూపించిందని విమర్శించారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వైద్యవిద్య విప్లవానికి నాంది పలికారని కొనియాడారు. ఈ సమావేశంలో మంత్రులు సత్యవతి రాథోడ్, అజరు కుమార్, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, తొమ్మిది జిల్లాల కలెక్టర్లు, స్థానిక ఎమ్మెల్యేలు, ఆయా మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ప్రాథమిక మెరిట్ జాబితాను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్్ బోర్డు విడుదల చేసింది. అభ్యంతరాలు స్వీకరించేందుకు వచ్చే నెల ఒకటి వరకు (4 రోజులు) గడువు ఇస్తున్నట్టు తెలిపింది. మెరిట్ జాబితా, ఇతర వివరాల mhsrb.telangana.gov.in సందర్శించాలని సూచించింది.