Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ నెల నుంచి 11 జిల్లాల కార్డుదారులందరికీ ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ
- ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12లతో కూడిన బియ్యంతో సంపూర్ణ పోషణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని పేదలందరికీ సంపూర్ణ పోషకాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, ఏప్రిల్ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకాలతో పాటు 11 జిల్లాల పరిధిలో ఉన్న ప్రతీ రేషన్ కార్డుదారుకు బలవర్ధక బియ్యాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉన్నతాధికారులతో పంపిణీ ఏర్పాట్లపై సమీక్షించారు. గ్రామీణ, పట్టణ పేద ప్రజలు పోషకాహార లోపంతో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్య పోషకాలైన ఐరన్, ఫోలిక్ ఆసిడ్, బీ12 విటమిన్లతో కూడిన ఫోర్టిఫైడ్ రైస్కెర్నల్స్ ఉన్న బలవర్థక బియ్యంను రేషన్ ద్వారా పంపిణీ చేయనున్నట్టు మంత్రి తెలిపారు. దాదాపు రాష్ట్రంలోని అన్ని మిల్లుల్లోనూ బ్లెండింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయనీ, ఫోర్టిఫైడ్ బియ్యాన్ని భారత ఆహార సంస్థకు కస్టమ్ మిల్లింగ్ రైస్‌లో భాగంగా 35 లక్షల మెట్రిక్ టన్నులు అందించినట్టు చెప్పారు. రాష్ట్రంలో ప్రజాపంపిణీ అవసరాల కోసం సివిల్ సప్లైస్ కార్పోరేషన్ 11 లక్షల మెట్రిక్ టన్నులను ఇప్పటికే సేకరించిందని మంత్రి వెల్లడించారు. వీటిని ఏప్రిల్ నెల నుంచి 11 జిల్లాల లబ్దిదారులకు అందజేస్తామని స్పష్టం చేశారు. మిగతా జిల్లాల్లో సైతం విడతల వారీగా 2024 మార్చి వరకూ ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
2021 సెప్టెంబర్‌లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బలవర్ధక బియ్యం పంపిణి ఫైలట్ ప్రాజెక్టుగా మొదలైందని తెలిపారు. తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఐసీడిఎస్, మద్యాహ్న భోజన పథకం, హాస్టళ్లకు అందించినట్టు వివరించారు. 2022 మే నుంచి అదిలాబాద్, అసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రజలకు పంపిణీ జరుగుతుందన్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, హన్మకొండ, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల పరిధిలో ఏప్రిల్ నెలలో దీని పంపిణీకి సర్వం సిద్దం చేసినట్టు వివరించారు.