Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీడియో కాన్ఫరెన్సులో ఎస్పీలు, కమిషనర్లను ఆదేశించిన డీజీపీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
పండుగలు వస్తున్న కారణంగా శాంతి భద్రతల పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లను డీజీపీ అంజనీ కుమార్ ఆదేశించారు. మంగళవారం వీరితో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన డీజీపీ రంజాన్ మాసం మొదలైందనీ, తర్వాత శ్రీరామనవమి, హనుమాన్ జయంతితో పాటు ఇతర పండుగలు వస్తున్నాయనీ, వీటిని దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా మతపరంగా సున్నితమైన ప్రాంతాలలో నిఘాను పెంచడంతో పాటు తగిన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్రలు నిర్వహించే ప్రాంతాల్లో సైతం అసాంఘీక శక్తుల కదలికలపై కన్నేసి ఉంచాలని, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడతారనే అనుమానమున్న కమ్యూనల్ రౌడీలను ముందుగానే అదుపులోకి తీసుకోవాలని ఆయన కోరారు. వీటితో పాటు ఇతర నేరాల అదుపునకు సైతం తగిన ప్రణాళికలతో అధికారులు ముందుకు సాగాలని ఆయన సూచించారు. అన్ని పోలీసు స్టేషన్ల పరిధులలో పోలీసులు పని తీరును కూడా ఎప్పటికప్పుడు పోలీసున్నతాధికారులు మదింపు చేసి ఏవైనా లోపాలుంటే సరిదిద్దాలని ఆయన కోరారు. ఈ సమావేశానికి తొలిసారిగా ఇటీవల శిక్షణను పూర్తి చేసుకున్న ఐదుగురు 74వ బ్యాచ్‌కు చెందిన ఎన్పీఏ యువ ఐపీఎస్ అధికారులను కూడా ఆహ్వానించారు.