Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రద్దీ లేదనడం అర్ధరహితం: కేంద్రానికి కేటీఆర్ ఘాటు లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు రెండవ దశ సాధ్యం కాదన్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర పురపాలక, పారిశ్రామిక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు తప్పుపట్టారు. ఇది తెలంగాణపై మరోసారి వివక్ష చూపించడమే అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో రెండో దశకు హైదరాబాద్ నగర ట్రాఫిక్ రద్దీ సరిపోదనడం పూర్తిగా అర్థరహితమని ఆక్షేపించారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి, కాన్పూర్, ఆగ్రా, ప్రయాగ్రాజ్, మీరట్ వంటి చిన్న పట్టణాలకు కేంద్రం మెట్రో ప్రాజెక్టులు కేటాయించిందనీ, హైదరాబాద్ వాటికంటే చిన్న సిటీ అవుతుందా? అన్ని ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం నాడాయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరికి ఘాటుగా లేఖ రాసారు. మెట్రో రెండోదశ డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టుతో (డీపీఆర్) పూర్తి సమాచారం అందించామని ఆ లేఖలో గుర్తుచేశారు. హైదరాబాద్ నగరానికి మెట్రో రైల్ విస్తరణ అర్హత లేదని చెప్పడం తనను చాలా ఆశ్చర్యానికి గురి చేసిందంటూ ఆ లేఖలో నిరసన వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పక్షపాత దక్పథంతో తీసుకున్న నిర్ణయమేనని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అన్ని అర్హతలు, అనుకూలతలు ఉన్న వివిధ ప్రాజెక్టులు, కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షను అనేకసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు తాను కూడా స్వయంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని లేఖలో పేర్కొన్నారు. అయినా కేంద్రంనుంచి ఇప్పటిదాకా ఎలాంటి సానుకూల స్పందన రాలేదన్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ, పీహెచ్డీటీ గణాంకాలు, ఇతర అర్హతలు, సానుకూలతలతో డీటీఆర్ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.
దీనికి సబంధించి రాష్ట్ర పురపాలకశాఖ అందించిన పలు నివేదికలను దానిలో పొందుపర్చారు. వీటన్నింటినీ మరోసారి కేంద్రానికి పంపుతామని చెప్పారు. హైదరాబాద్ మెట్రో రెండోదశ అవసరాలను వివరించేందుకు తాను వ్యక్తిగతంగా అనేకసార్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసేందుకు ప్రయత్నించాననీ, కానీ ఆయన మంత్రిత్వశాఖ నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్రం దీనిపై మరోసారి పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.