Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప్పల్లో ఐదేండ్లు దాటినా 40 శాతం పూర్తికాని ఎలివేటెడ్ కారిడార్ పనులు
- నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాని బొమ్మతో పోస్టర్లు
నవతెలంగాణ-హైదరాబాద్
హైదరాబాద్లో ప్రధాని మోడీ పోస్టర్లు మరోసారి కలకలం సృష్టించాయి. వరంగల్ జాతీయ రహదారిపై ఉప్పల్లో ఎలివేటెడ్ కారిడార్ జాప్యంపై ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ట్రాఫిక్ సమస్యను తగ్గించడం కోసం ఎలివేటెడ్ కారిడార్ పనులకు 2018లో రూ.675 కోట్లతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. రెండు సంవత్సరాల్లో పనుల పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని.. కానీ ఇప్పటికీ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. ఈ క్రమంలో 'మోడీ గారు ఈ ఫ్లైఓవర్ ఇంకెన్ని సంవత్సరాలు కడతారు..? పని ప్రారంభం 5 మే 2018, 5 ఏండ్లు అయినా ఉప్పల్ ఫ్లై ఓవర్ 40 శాతం కూడా పూర్తి కాలేదు' అంటూ గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం ఫ్లై ఓవర్ పిల్లర్లకు పోస్టర్లు అంటించారు. దాంతో ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇదిలా ఉండగా, ఈ నిర్మాణ పనులతో ఉన్న రోడ్డు పూర్తిగా దెబ్బతి నడంతో జనం నిత్యం ఇబ్బందిపడుతున్నారు.