Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిమ్స్ ఎంసీహెచ్ ఆస్పత్రికి మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మాతా, శిశు మరణాలను తగ్గించడంలో దేశంలోనే రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిందనీ, మొదటి స్థానం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. మంగళవారం నిమ్స్ 200 పడకల మాతా, శిశు ఆస్పత్రి (మదర్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ - ఎంసీహెచ్) నిర్మాణానికి ఆయన శంకు స్థాపన చేశారు. ఇతర సమస్యలతో బాధపడే గర్భిణీలను పెద్దాస్పత్రులకు రెఫర్ చేసిన సమయాల్లో మార్గమధ్యంలో చనిపోతుంటారని మంత్రి గుర్తుచేశారు. ఈ పరిస్థితి తలెత్తకుండా మాతా, శిశు ఆస్పత్రులకు ప్రత్యేకంగా రూ.490 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు హరీశ్ రావు వివరించారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల చెంతనే ఎంసీహెచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. తద్వారా ఇతర సమస్యలున్న గర్భిణులు మార్గమధ్యంలో చనిపోవడాన్ని నివారించేందుకు సాధ్యపడుతుందని తెలిపారు. డయాలసిస్ రోగుల కోసం ప్రస్తుతం నిమ్స్‌లో 34 బెడ్లుండగా వాటిని 100కు పెంచినట్టు మంత్రి తెలిపారు. దీనితో ప్రతి రోజు 1,500 మందికి డయాలసిస్ సేవలందుతాయన్నారు.
త్వరలో 2,000 పడకల నిమ్స్ కొత్త బిల్డింగ్‌కు సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
26 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామకపత్రాలు
నిమ్స్‌లో కొత్తగా ఎంపికైన 26 మంది బ్రాడ్, సూపర్ స్పెషాలిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మంత్రి హరీశ్ రావు నియామక పత్రాలు అందించారు. నిమ్స్‌పై నమ్మకం పెంచేలా పని చేయాలని సూచించారు. బాగా పనిచేసే ప్రొఫెసర్స్కి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిపారు.