Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతోన్మాదాన్ని సహించబోమంటూ పిడికిలెత్తి నినాదం
- అడుగడుగునా కనిపించిన కృష్ణమూర్తి, పాషా, నరహరి స్ఫూర్తి
- ఆరుట్ల, మంచాలలో ఎర్రజెండా రెపరెపలు
- యాత్ర బృందం వెంట బైకుర్యాలీతో యువత
- సభలకు పెద్ద ఎత్తున తరలొచ్చిన జనం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి చిరునామాగా నిలిచిన రాచకొండ గుట్టల్లో జయహో సీపీఐ(ఎం)...ఎర్రజెండకు జై నినాదాలు మార్మోగాయి. బీజేపీ మతోన్మాదాన్ని ఇక సహించబోమంటూ యువత పిడికిలెత్తి నినదించింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కాచం కృష్ణమూర్తి, పార్టీ ఉద్యమ నిర్మాతలు పాషా, నరహరిల స్ఫూర్తి అడుగడుగునా కపిపించింది. రంగారెడ్డి జిల్లా ఆరుట్ల, మంచాలలో సీపీఐ(ఎం) జనచైతన్య యాత్ర బృందానికి ఉద్యమ స్వాగతం లభించింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎటుచూసినా ఎర్రజెండా రెపరెపలు కొత్త శోభను తెచ్చిపెట్టాయి. నియోజకవర్గంలో పూర్వవైభవం తెచ్చిపెట్టేందుకు దండు కదిలిందా అన్నట్టుగా ఉత్తేజపూరిత వాతావరణం నెలకొంది. పెద్దఎత్తున బైకు ర్యాలీ చేపట్టి యువత కదనరంగంలోకి దూకింది. మతోన్మాదుల చేతుల్లో హత్యగావించబడిన పాషా, నరహరి స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. ఆ ప్రాంతానికి ఉద్యమబాటలు వేసిన కాచం కృష్ణమూర్తిని స్మరించుకున్నారు. చాలా మంది వృద్ధులు వారితో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. భారీ క్రేన్‌తో యాత్ర బృందానికి గజమాల వేసి, ఎర్రజెండా పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. దారి పొడవునా పూలు చల్లుతూ ఎర్రజెండా అజేయమని నినదించారు. ఇబ్రహీంపట్నం పోటీ చేసే స్థానంలో ఉండదంటూ తమ్మినేని ప్రకటించగానే ప్రజలు, కార్యకర్తల నుంచి భారీ స్పందన వ్యక్తమైంది. ఈలలు, కేకలు వేస్తూ ఉత్సాహం పొందారు. విప్లవాల గడ్డ ఇబ్రహీంపట్నంకు వచ్చిన యాత్రకు గుండెల లోతుల్లో నుంచి చూపించిన ప్రేమాభిమానాలు అపూర్వమనీ, మరచిపోలేమని యాత్ర రథసారధి పోతినేని సుదర్శన్ ప్రకటించడంతో చప్పట్లు మార్మోగాయి. యాత్ర బృంద సభ్యులు పార్టీ శ్రేణులతో కలిసి నృత్యం చేశారు.