Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అలాంటి పనులు చేయకండి :దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నడిచే రైళ్లపైకి రాళ్లు విసరడం విజ్ఞత కాదనీ, ఇలాంటి ఆకతాయి చర్యలకు పాల్పడిన వారిని రైల్వే చట్టం ప్రకారం నేరుగా జైలుకు పంపిస్తామని దక్షిణ మధ్య రైల్వే హెచ్చరించింది. ఇలాంటి ఘటనల వల్ల ప్రయాణీకులకు తీవ్ర గాయాలవుతాయనీ, రైల్వే ఆస్తులకూ నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. ఎవరూ ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ వద్దంటూ ప్రజలకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) విజ్ఞప్తి చేసింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లపై రాళ్ల దాడి శిక్షార్హమైనదని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే నేరస్థులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం ఐదేండ్లు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట - ఖమ్మం, కాజీపేట - భువనగిరి, ఏలూరు - రాజమండ్రి రూట్లలో 9 ప్రాంతాల్లో వందే భారత్ రైళ్లపై దుండగులు రాళ్ల దాడులు చేశారని గుర్తుచేశారు. ఈ పరిస్థితులు రైళ్ళ రీషెడ్యూల్కు దారితీశాయనీ, ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారనీ తెలిపారు. ఈ ఘటనల్లో రైలులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణీకుల తలలకు రాళ్లు తగిలి తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. ఈ ఘటనలకు పాల్పడిన 39 మంది నేరస్తులను గుర్తించి, అరెస్టు చేసి జైలుకు పంపామన్నారు. ఈ ఘటనల్లో 6 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు కూడా ఉన్నారనీ, తల్లిదండ్రులు ఈ విషయాలను గ్రహించాలని సూచించారు. అటువంటి సంఘటనలను చూసిన వ్యక్తులు 139కి డయల్ చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ విజ్ఞప్తి చేశారు. పెద్దలు తమ పిల్లలకు కౌన్సెలింగ్ ఇవ్వాలనీ, చిన్నపిల్లల చేష్టల కారణంగా తీవ్ర పరిణామాల గురించి అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు.