Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కష్టపడినవారికి పార్టీలో గుర్తింపు
- 42 పార్లమెంటు కేంద్రాల్లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు: టీడీపీ పొలిట్‌బ్యూరో తీర్మానం
- పార్టీని మరింత బలోపేతం చేస్తాం: చంద్రబాబు
- జగన్‌ది హీనచరిత్ర: అచ్చెన్నాయుడు
- 119 నియోజకవర్గాల్లో పోటీ: కాసాని జ్ఞానేశ్వర్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
వచ్చే ఎన్నికల్లో 40 శాతం టికెట్లు యువతకు ఇవ్వాలని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. కష్టపడేవారికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించింది. మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్భవన్లో పార్టీ జాతీయ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు అధ్యక్షతన పోలిట్‌బ్యూరో బేటీ జరిగింది. దీనికి తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, ఏపీ శాఖ అధ్యక్షులు అచ్చెన్నాయుడుతోపాటు పోలిట్‌బ్యూరో సభ్యులంంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుదీర్ఘ మంతనాల అనంతరం పొలిట్‌బ్యూరో పలు తీర్మానాలను ఆమోదించింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పార్టీని ఇరు రాష్ట్రాల్లో బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎన్టీఆర్ శతజయంతి కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వివరించారు. బుధవారం మే 28 వరకు శతజయంతి ఉత్సవాలను 42 పార్లమెంట్ నియోజకవర్గాల్లో నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై వైసీపీ పిచ్చి ప్రేలాపణలు ఆపాలని పోలిట్‌బ్యూరో సమావేశం అనంతరం అచ్చెన్నాయుడు విలేకర్లతో మాట్లాడుతూ అన్నారు. సైకిల్‌గుర్తుపై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నాడో జగన్ చెప్పాలని ప్రశ్నించారు. వైసీపీ ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా, యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతున్నదని చెప్పారు. ఏపీకి చెంది 13, తెలంగాణకు సంబంధించి నాలుగు మొత్తం 17 అంశాలపై తీర్మానాలు చేసినట్టు ప్రకటించారు. అకాల వర్షాలపై సీఎం ఇప్పటివరకు కనీసం సమీక్ష చేయకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. జీవో నెంబరు ఒకటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ వచ్చాకే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. నాలుగేండ్లుగా రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. కొత్త పరిశ్రమల సంగతి పక్కబెడితే, ఉన్నవి మూతపడుతున్నాయని గుర్తు చేశారు.
ఘనంగా ఆవిర్భావ దినం: కాసాని
తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో పోటీచేస్తామని ప్రకటించారు. ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో క్యాడర్‌తో ఉత్సాహం ఉరకలేస్తున్నదని చెప్పారు. ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని కోరారు. కేసీఆర్ ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్స్ గ్రౌండ్స్‌లో బుధవారం సాయంత్రం మూడు గంటలకు సభ ప్రారంభమవుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 15 వేల మంది హాజరవుతున్నారని చెప్పారు. ఈమేరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సన్నాహాలు చేసినట్టు తెలిపారు.