Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫీజుబులిటీ లేదనడం విడ్డూరం
- నగరంలోకి 500 ఎలక్ట్రానిక్ బస్సులు
- ఖాజాగూడ పెద్ద చెరువు సుందరీకరణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
నవతెలంగాణ-సిటీబ్యూరో
మెట్రో విస్తరణకు కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకున్నా చేపడతామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని లక్డికాపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో విస్తరణ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా ఫీజిబులిటీ లేదని నివేదిక ఇచ్చారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం మెట్రో విస్తరణ పనులు చేపడుతుందన్నారు. మంగళవారం ఖాజాగూడ పెద్ద చెరువు సుందరీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్టు కాదా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. నగరంలో ప్రజా రవాణా కోసం 500 ఎలక్ట్రానిక్ బస్సులను తీసుకొస్తున్నట్టు తెలిపారు. నగరంలోని 50 చెరువులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అభివృద్ధి, సుందరీకరణ చేసేందుకు ముందుకొ చ్చిన నిర్మాణ రంగ సంస్థలు వరల్డ్ సిటీ స్థాయిలో పనులు చేపట్టాలని కోరారు.
హైదరాబాద్ నగరానికి అధునాతన సదుపాయాలు కల్పించడానికి రూ.2,400 కోట్లతో లింక్ రోడ్లు, రూ.10 వేల కోట్లతో మూసీ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రామోజీ ఫిలిం సిటీ లాంటి ఫిలిం సిటీని రాచకొండలో అత్యంత ఆధునిక, సాంకేతిక పరిజ్జానంతో ప్రపంచం అబ్బురపడేలా తీసుకొస్తామని, ఒలంపిక్ స్థాయిలో స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తామని చెప్పారు. హైదరాబాద్ కృష్ణా బేసిన్లో ఉన్నదని, 94 శాతం నీరు గ్రావిటీ ద్వారా మూసీ నదిలోకే ప్రవహిస్తుందన్నారు. సీఎస్ఆర్ పద్ధతి ద్వారా చేపట్టే చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్, సేద తీరడానికి కుర్చీల ఏర్పాటు, వ్యాయామశాల, ఆట స్థలం, థీమ్ పార్కు, టాయిలెట్స్, లైటింగ్, సెక్యూరిటీ గార్డ్ వంటి అధునాతన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. చెరువులలో ప్రయివేట్ ల్యాండ్ ఉన్నచో వాటికి టీడీఆర్ జారీ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 13 చెరువుల్లో ఉన్న 115 ఎకరాల ప్రయివేటు భూములను సేకరించి 200 శాతం విలువతో టీడీఆర్‌లను జారీ చేసినట్టు తెలిపారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్‌ను సంప్రదించొచ్చని సూచించారు. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను డీమార్క్ చేసి మ్యాప్‌లు సిద్ధంగా ఉన్నాయన్నారు.
2022లో మన హైదరాబాద్‌కు ఆఫీస్ ఫేస్‌లో నెంబర్ 1 వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం వ్యాక్సిన్ నగరంగా పేరుగాంచిందని, భవిష్యత్‌లో 1400 కోట్ల వ్యాక్సిన్లను ప్రపంచ దేశాలకు సరఫరా చేయనున్నట్టు తెలిపారు. దుర్గం చెరువును డెవలప్ చేయడం ద్వారా టూరిస్ట్ అట్రాక్షన్, సినిమా షూటింగ్‌లకు నిలయంగా మారిందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువుల అభివృద్ధి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సుందరీకరణ, మెయింటెనెన్స్‌కు ఎంఓయూ చేసుకునేందుకు ఆసక్తి గల వారు ముందుకు రావాలన్నారు. ఈ సందర్భంగా 51 చెరువులకు సంబంధించి ఎంఓయూ పత్రాలను వారికి అందజేశారు. ఇటీవల ఫాక్స్ఖాన్ చైర్మెన్ హైదరాబాద్‌ను సందర్శించిన నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలిసినప్పుడు హైదరాబాద్ సిటీ అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చారని గుర్తు చేశారు. కొంగరకలాన్‌లో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టడం ద్వారా 30వేల మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, ఆకులలలిత, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్, కమిషనర్ డిఎస్.లోకేష్‌కుమార్, సీసీపీ దేవేందర్‌రెడ్డి, సీఈ సురేష్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్లు బాబా ఫసియుద్దీన్, గంగాధర్, మాజీ కార్పొరేటర్ సాయిబాబా ఇంజినీరింగ్ విభాగం అధికారులు, నిర్మాణ రంగ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.