Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్
- కేసీఆర్ అర్థం కావడం లేదని వ్యాఖ్య
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
లోక్సభలో రాహుల్ గాంధీ అదానీ అక్రమాలను బయటపెట్టినందుకే ఆయనపై అనర్హత వేటు వేశారని మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ విమర్శించారు. ఆదానీ అక్రమాలు బయటపడితే మోడీ బండారం కూడా బయటపడుతుందనే అనర్హత వేటు వేశారని తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ మాణిక్రావు ఠాక్రేతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కేవలం విపక్షాల గొంతు నొక్కేందుకు బీజేపీ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ఐసీ, ఎస్బీఐ నిధులను కేంద్ర ప్రభుత్వం అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిందని తప్పుపట్టారు. అమెరికా, శ్రీలంక దేశాల్లో రాజకీయ నేతలపై పరువు నష్టం దావాలు ఎత్తేసినట్టుగానే మన దేశంలోనూ ఎత్తేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. భావప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం న్యాయ, ప్రజా పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు.
కేసీఆర్ ఎవరికి వ్యతిరేకమో అర్థం కావడం లేదు..
మహారాష్ట్ర రాజకీయాల్లోకి బీఆర్ఎస్ ప్రవేశించడాన్ని అశోక్ చవాన్ స్వాగతించారు. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్.. భాజపాకి వ్యతిరేకంగా పని చేస్తున్నారో? కాంగ్రెస్కు వ్యతిరేకంగా పని చేస్తున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. అయితే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని కేసీఆర్ ఖండించారనీ, దీనిని స్వాగతిస్తున్నట్టు తెలిపారు.