Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెప్పులు కుడుతూ ఎస్ఎఫ్ఐ నిరసన
నవతెలంగాణ-కంఠేశ్వర్
టీఎస్పీఎస్సీ పేప ర్లను లీకేజీ చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్‌లో మంగళవారం ఎస్ఎఫ్ఐ నాయకులు చెప్పులు కుడుతూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విగేష్ మాట్లాడుతూ.. బోర్డు నిర్లక్ష్యం వల్ల నాలుగు లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు అంధకారంలోకి నెట్టివేయబడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బోర్డు చైర్మెన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజ్‌పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని కోరారు. పేపర్ల లీకేజీ జరిగి పది రోజులవుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం దుర్మార్గమని, తక్షణమే స్పందించి నిరుద్యోగులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ వల్ల నష్టపోయిన నిరుద్యోగులందరికీ రాష్ట్ర ప్రభుత్వం నెలకి రూ.20వేలు ఆర్థిక సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిస్వాల్ కమిటీ చెప్పిన ఉద్యోగాలన్నింటికీ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వం నిలబడాలని కోరారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు నిరుద్యోగ భృతిని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి మహేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు దీపిక, నాయకులు వేణు, గణేష్, సాయి కిరణ్, రాహుల్, ఆశీర్వాదం, తదితర నాయకులు పాల్గొన్నారు.