Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలి : కూనంనేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న 70 వేలమంది కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాన్ని అమలు చేయడం వల్ల మూడు లక్షల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సంస్థలలో 1999 నుంచి 2004 వరకు ఉద్యోగంలో చేరిన వారికి రాష్ట్రంలో మిగతా ప్రభుత్వ రంగ సంస్థల్లో మాదిరిగా ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ని అమలు చేయాలని కోరారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్కో, జెన్కో, డిస్కం, నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ నాలుగు సంస్థల్లో పనిచేస్తున్న 70 వేల మందికి ఉపయోగం జరుగుతుందని సూచించారు. 2017లో విద్యుత్ కంపెనీల్లో కాంట్రాక్టు కార్మికులుగా పని చేస్తున్న సుమారు 23 వేల మందిని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిజన్లుగా గుర్తించిందనీ, వారి సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. 2018లో పది శాతం ఫిట్మెంట్ ఇచ్చి అన్యాయం చేశారని తెలిపారు. రాబోయే పీఆర్సీలో న్యాయం జరిగేటట్టు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కారుణ్య నియామకాలు చేపట్టాలని సూచించారు. టీఎస్జెన్కోలో పనిచేస్తూ మరణించిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చిన తర్వాత వారు కూడా మరణిస్తే రెండో నియామకం ఇవ్వటం కుదరదంటూ తెలియజేసిందనీ, జీవోను రద్దుచేసి కారుణ్య నియామకాలు ఇవ్వాలని తెలిపారు.