Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి హెచ్చరిక
- పెండింగ్ బిల్లులన్నీ 31లోగా విడుదల చేయాల్సిందే
- ధనిక రాష్ట్రంలో జీతాల కోసం ధర్నా చేయడం సిగ్గుచేటు : యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యుల ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రతినెల ఒకటో తేదీన జీతాలివ్వకపోవడం, ఈ-కుబేర్‌లో బిల్లులన్నీ పెండింగ్‌లో ఉండడం ప్రమాదకరమని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విమర్శించారు. వారి కడుపుమండే బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ దిశగా విధానాలను మార్చుకుంటారా? లేదంటే తగిన మూల్యం చెల్లించుకుంటారా?అని సీఎం కేసీఆర్‌ను హెచ్చరించారు. ఎయిడెడ్ జీతాలు, పెండింగ్ బిల్లుల మంజూరు కోసం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేతనాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. ఎన్నో పథకాలకు రూ.వేల కోట్లు కేటాయించే ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం రూ.300 నుంచి రూ.500 కోట్లు కేటాయించలేకపోవటం ఏమిటని ప్రశ్నించారు. ఆ బిల్లుల చెల్లింపుల కోసం బడ్జెట్ ఉన్నప్పటికీ గత మూడు నెలలుగా ఎయిడెడ్ టీచర్లకు వేతనాలు ఇవ్వక పోవటం సిగ్గుచేటని విమర్శించారు. ధనిక రాష్ట్రమనీ, ఉద్యోగులకు అత్యధిక జీతాలిస్తున్నామనీ పదే పదే చెప్పే పాలకులు సప్లిమెంటరీ వేతనాలు, సెలవు జీతాలు, టీఎస్జీఎల్ఐ, జీపీఎఫ్ క్లైములు, పీఆర్సీ బకాయిలు, మెడికల్ రీయింబర్స్మెంట్, పెన్షన్ బకాయిలు వంటి బిల్లులన్నీ నెలల తరబడి మంజూరు చేయకపోవటం వల్ల ఉపాధ్యాయులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. మరో పిఆర్సీ గడువు సమీపిస్తున్నా 18 వాయిదాల్లో ఇస్తామన్న రెండు నెలల గత పీఆర్సీ బకాయిలు 11 నెలలు గడిచినా కేవలం మూడు, నాలుగుకు మించి జమ కాలేదని చెప్పారు. మూడు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ట్రెజరీల్లో పాసైన అన్ని బిల్లులకు సంబంధించిన నగదును ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసేందుకు ఆర్థిక శాఖ చొరవ చూపాలని డిమాండ్ చేశారు. వచ్చేనెల ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుందనీ, బిల్లులు పెండింగ్‌లో లేకుండా నిర్దిష్ట విధానం రూపొందించాలనీ డిమాండ్ చేశారు. వచ్చేనెల 11న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై స్టే ఎత్తేసి చేపట్టాలని సూచించారు. లేదంటే ఉపాధ్యాయ నియామకాలపై ప్రభావం పడుతుందన్నారు. జీతాల ఆలస్యం, బిల్లుల పెండింగ్‌పై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ గొంతెత్తాలనీ, ఐక్యంగా పోరాడాలనీ ఆయన పిలుపునిచ్చారు. యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు చావ రవి, ముత్యాల రవీందర్, ఎం సోమయ్య, ఎన్ యాదగిరి, వై విజయకుమార్, ఎస్ హరికృష్ణ, బి కొండయ్య, నజీర్, పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి కృష్ణమూర్తి మాట్లాడుతూ ధనిక రాష్ట్రంలో జీతాల కోసం ధర్నా చేయాల్సిన పరిస్థితి రావడం సిగ్గుచేటని విమర్శించారు. ఎయిడెడ్ టీచర్లకు మూణ్నెల్లుగా జీతాలివ్వకుంటే ఆ కుటుంబాలు ఎలా బతకాలని ప్రశ్నించారు. ఉపాధ్యాయు లూ మనుషులేననీ, వారి అవసరాలు తీర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రెజరీల్లో ఆమోదం పొంది ఆర్థికశాఖ వద్ద నెలల తరబడి పెండింగు లో ఉన్న బిల్లులన్నీ ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా విడుదల చేయాలని డిమాండ్ కోరారు. యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు కె జంగయ్య, వై అశోక్ కుమార్, టి లింగారెడ్డి అధ్యక్ష వర్గంగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం నాయకులు భద్రయ్య, వివిధ జిల్లాల నుంచి వందలాది మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
యూఎస్పీసీ డిమాండ్లు :
- ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రతినెలా 1వ తేదీనే వేతనాలివ్వాలి.
- ఎయిడెడ్ టీచర్లకు మూడు నెలలుగా బకాయి పడిన వేతనాలను వెంటనే విడుదల చేయాలి.
- ట్రెజరీల్లో పాసై ప్రభుత్వం వద్ద పెండింగులో ఉన్న సప్లి మెంటరీ వేతనాలు, పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయి లు,మెడికల్ రీయింబర్స్మెంట్, సెలవు వేతనాలు,పెన్ష నరీ బకాయిలు, టీఎస్జీఎల్ఐ, జీపీఎఫ్ క్లైములు తది తర బిల్లులన్నీ ఈనెల 31లోగా విడుదల చేయాలి.