Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీవి అచ్ఛేదిన్ కాదు చచ్చే దిన్
- రైతు ఉద్యమాల వల్లే నల్ల చట్టాలు వెనక్కి
- ఎర్రజెండా ద్వారానే దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు విజ్జుకృష్ణన్
నవతెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి (పరిపూర్ణం)/ వనపర్తి
ప్రజా పోరాటాలను కాలదన్నిన శ్రీలంక ప్రధానికి పట్టిన గతే మోడీకి పట్టడం ఖాయమని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు విజ్జు కృష్ణన్ అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జన చైతన్య యాత్ర మూడోరోజు మంగళవారం గద్వాల నుంచి వనపర్తి, నాగర్కర్నూల్ కల్వకుర్తి పట్టణాల మీదుగా జరిగింది. వనపర్తిలో అంబేద్కర్ విగ్రహానికి విజ్జు కృష్ణన్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.సాగర్ తదితరులు పూలమాల వేసి నివాళి అర్పించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తా డిపో రోడ్డులో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి యం.డి. జబ్బార్ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో విజ్జు కృష్ణన్ ప్రసంగించారు. మోడీ అధికారంలోకి వస్తే అత్యధిక ఉద్యోగాలు ఇస్తామని నమ్మించారని తెలిపారు. అనేక వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మురిపించి గద్దెనెక్కిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేడు హామీలు మరిచి మతతత్వ రాజకీయాలకు తెర లేపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 ఏండ్ల కిందట గ్యాస్ ధర రూ.450 రూపాయలుంటే నేడు 1200కు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.50 ఉన్న లీటర్ పెట్రోల్ ధర నేడు వంద రూపాయలు దాటిందని చెప్పారు. దేశంలో చాలా మంది ఆసక్తి చూపే ఆర్మీ ఉద్యోగంలోనూ కాంట్రాక్టు వ్యవస్థ తీసుకురావడం అత్యంత దుర్మార్గమన్నారు. గిట్టుబాటు ధర కావాలంటే స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు చేయాలన్నారు. పారిశ్రామికవేత్తలకు లబ్ది చేకూర్చేందుకే రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చి రైతుల నడ్డివిరిచే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే పెద్దఎత్తున దేశ వ్యాప్త ఉద్యమం చేసి ఆ నల్ల చట్టాలను రద్దు చేయించి మోడీ చేత క్షమాపణ చెప్పించిన ఘనత ఈ దేశ రైతులకే దక్కుతుందన్నారు. కరోనా సమయంలో దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా నాణ్యమైన వైద్యం అందించి లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన ఘన చరిత్ర కేరళ రాష్ట్ర ప్రభుత్వానిదని వివరించారు. ఆ సమయంలో 20 రకాల నిత్యావసర వస్తువులను పేద ప్రజలకు ఇంటింటికీ తిరిగి ఉచితంగా అందించామన్నారు. నేడు ఎర్రజెండా ద్వారా దేశంలో ప్రత్యామ్నాయ వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు.