Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్ అంటే మోడీకి భయం
- రాజ్యాంగ స్ఫూర్తిని ధ్వంసం చేస్తున్న మోడీ
- బీజేపీని ఓడించేందుకు కలిసొచ్చే వాళ్లకు మద్దతు : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
చరిత్ర లేని చండాలపు పార్టీ బీజేపీ అని, ఆ పార్టీని గద్దె దించే వరకు కమ్యూనిస్టుల పోరాటం ఆగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనబోమని ప్రకటించి బ్రిటీషోళ్లకు తొత్తులుగా వ్యవహరించి, దేశద్రోహానికి పాల్పడిన హీన చరిత్ర ఆర్ఎస్ఎస్, ఆనాటి హిందూ మహాసభదన్నారు. ఆ సంస్థల వారసులుగా ఉన్న బీజేపీకి జాతీయోద్యమ చరిత్ర లేదని తెలిపారు. ఆ సంస్థలను నడిపిన కేబీ హెడ్గేవార్ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనొద్దని ప్రజలకు పిలుపు నివ్వగా సావర్కర్ క్షమాబిక్ష కోరిండని గుర్తు చేశారు. రాహుల్‌గాంధీ అంటే మోడీకి భయం పట్టుకుందన్నారు. ఒక రాజకీయ వ్యాఖ్య చేసినందుకు కోర్టు రెండేండ్ల శిక్ష వేసిందని, ఎంపీగా అనర్హత వేటు వేశారని, అదే ప్రధాని మోడీ రాహుల్‌ను ఉద్దేశించి.. 'నీ జన్మ ఎక్కడా..? నీ తండ్రి ఎవరు..? గాంధీ అని ఎందుకు పెట్టుకున్నవ్.. నెహ్రు అని ఎందుకు పెట్టుకోలేదు' అంటూ వ్యాఖ్యలు చేసినందుకు వందేండ్ల శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అదానీ అంటే మోడీకి పెంపుడు కొడుకని, అదానీ తప్పు చేయలేదని మోడీ నమ్మే దేవుళ్లపై ప్రమాణం చేసి చెప్పగలడా అని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు, జాతి సంపదైన పోర్టులు, విమానాశ్రయాలు, రైల్వేలు, ఎల్ఐసీ, బ్యాంకుల్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్నాడని విమర్శించారు. అదానీ అక్రమాలపై జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ మిత్రులకు రూ.2 లక్షల కోట్ల పన్నులు మాఫీ చేసిన మోడీ, పేదల సంక్షేమానికి మాత్రం రూ.4 లక్షల కోట్లకు మించి ఖర్చు చేయట్లేదని తెలిపారు. లౌకిక, సమాఖ్య విధానాలు, సార్వభౌమత్వం వంటి రాజ్యాంగ స్పూర్తిని బీజేపీ ధ్వంసం చేస్తుందని విమర్శించారు. పేదల కడుపుకొడుతున్న మోడీని ఓడించే వరకు కమ్యూనిస్టు పార్టీ పోరాడుతుందని స్పష్టంచేశారు. బీజేపీని గద్దెదించేందుకు కలిసొచ్చే పార్టీలు, శక్తులకు మద్దతు ఇస్తామని తెలిపారు. అదే క్రమంలో రాష్ట్రంలో పేదల సమస్యలపైనా పోరాటాలు చేస్తామని చెప్పారు. మార్క్సిజం కాలం చెల్లిన సిద్దాంతం కాదు కాలానికి దశ-దిశ చేసే సిద్దాంతమని తెలిపారు. మనుషులున్నంత కాలం మార్క్సిజం ఉంటుందన్నారు. సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటీ నర్సింహ, సిద్దిపేట జిల్లా కార్యదర్శి పవన్, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జిలాల్, మెదక్ జిల్లా కార్యదర్శి తాలిక్, నాయకులు యూసుప్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.