Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్పీస్సీ పేపర్ లీక్ కేసులో ముగిసిన నిందితుల సిట్ కస్టడీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
టీఎస్పీస్సీ పేపర్ లీకేజ్ కేసులో నిందితుల సిట్ కస్టడీ ముగిసింది. కస్టడీలో వున్న ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా, రాజేశ్వర్ నుంచి సిట్ అధికారులు కీలక సమాచారం సేకరించినట్టు తెలిసింది. అత్యాశే వారి కొంపముంచిందని తెలుస్తోంది. రేణుక ఇద్దరికి ఏఈ పేపర్ విక్రయించగా, ఆమె భర్త అత్యాశకు పోయి మరికొందరికి పేపర్ విక్రయించినట్టు తెలిసింది. మంగళవారంతో నిందితుల కస్టడి ముగియడంతో వైద్యపరీక్షల అనంతరం నలుగురిని నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా, ఈ కేసులో మరో ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మూడ్రోజుల విచారణలో నిందితులిచ్చిన వివరాలపై దృష్టి సారించిన అధికారులు మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశాలున్నాయి.
కీలక విషయాలు వెలుగులోకి..
పేపర్ లికేజీ కేసులో ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా, రాజేశ్వర్‌ను మూడో రోజు విచారణలో భాగంగా మంగళవారం ఉదయం పోలీసులు సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. వీరు ఎంతమందికి పేపర్ అమ్మారనే విషయాలపై ఆరా తీశారు. ఈ క్రమంలో రేణుక, డాక్యా నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు అత్యధికంగా ప్రశ్నాపత్రాలు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఇదిలావుండగా, మేడ్చల్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కేతావత్ శ్రీనివాస్ ద్వారా గోపాల్, నీలేష్ రేణుకకు పరిచయమయ్యారు. వారికి నీలేష్ సోదరుడు రాజేంద్రనాయక్ డబ్బులు సమకూర్చాడు. ముందుగా ఇద్దరు అభ్యర్థులు కలిసి రూ.20లక్షలు చెల్లించే విధంగా రేణుకతో ఒప్పందం చేసుకున్నారు. కానీ, ఒకరు రూ.9లక్షలు చెల్లించగా, మరో అభ్యర్థి రూ.4.50లక్షలు చెల్లించినట్టు దర్యాప్తులో తేలింది. వారినుంచి మొత్తం రూ.13.50లక్షలు తీసుకున్న రేణుక అందులో నుంచి ప్రవీణ్‌కు రూ.10లక్షలు చెల్లించి ఏఈ పేపర్స్‌ను తీసుకుంది. అయితే, సులువుగా పెద్దమొత్తంలో డబ్బులు సంపాదించొచ్చని ఆశపడిన అమె భర్త డాక్యానాయక్ మాత్రం చాలా మందికి ప్రశ్నాపత్రం విక్రయించినట్టు అధికారుల విచారణలో తేలినట్టు సమాచారం. టీఎస్పీఎస్సీలో పనిచేసే కొంత మంది సిబ్బందితోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పలువురికి రహస్యంగా ప్రశ్నాపత్రాలను విక్రయించినట్టు గుర్తించిన అధికారులు వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో మరో ముగ్గురిని అరెస్టు చేశారు.
ముగ్గురికి ఐదురోజుల కస్టడీ
ఈ కేసులో మరో ముగ్గురికి ఐదు రోజుల పోలీస్ కస్టడీకీ కోర్టు అనుమతించింది. కమిషన్ ఉద్యోగులైన షమీమ్, రమేష్, సురేషను విచారిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని గుర్తించిన సిట్ అధికారులు వారిని ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టును కోరారు. అయితే, కోర్టు వారిని ఐదురోజుల కస్టడీకి అనుమతించింది. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారిని బుధవారం సిట్ అధికారులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు.