Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఆర్సీపై యాజమాన్యంతో చర్చలు విఫలం
- 31న సమ్మె నోటీసు ఇవ్వాలని జేఏసీ నిర్ణయం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ ఉద్యోగులు ఏప్రిల్ 17 నుంచి సమ్మె బాట పట్టనున్నారు. ఈ మేరకు ఈనెల 31న యాజమాన్యాలకు సమ్మె నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. వేతన సవరణతో పాటు ఇతర సమస్యల పరిష్కారంలో యాజమాన్యం, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్పీఈజేఏసీ) ప్రకటించింది. విద్యుత్ ఉద్యోగుల జేఏసీలను బుధవారం యాజమాన్యం చర్చలకు ఆహ్వానించింది. ఆరు శాతానికి మించి ఫిట్మెంట్ ఇవ్వలేమని తేల్చిచెప్పడంతో చర్చలు ముందుకు సాగలేదు. యాజమాన్య చర్చల్లో పీఆర్సీపై స్పష్టమైన హామీ రానందున, ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్‌తో పాటు ఇతర అంశాలు ఏవీ ప్రస్తావనకు రాలేదని జేఏసీ నేతలు ప్రకటించారు. బుధవారం యాజమాన్యంతో జరిగిన చర్చల్లో జేఏసీ చైర్మెన్ సాయిబాబు, కన్వీనర్ రత్నాకరరావు, కో కన్వీనర్లు శ్రీధర్, బీసీ రెడ్డి, వైస్ చైర్మెన్లు అనిల్‌కుమార్, వజీర్, జాయింట్ సెక్రటరీ గోవర్థన్ తదితరులు పాల్గొన్నారు. ఆ చర్చల్లో స్పష్టత రాకపోవడంతో విద్యుత్ ఇంజినీర్స్ భవన్లో జేఏసీ నేతలు అత్యవసరంగా భేటీ అయ్యి, సమ్మె నిర్ణయాన్ని ప్రకటించారు. విద్యుత్ ఉద్యోగులకు 2022 ఏప్రిల్ 1 నుంచి నూతన వేతన సవరణ అమల్లోకి రావాల్సి ఉందనీ, యాజమాన్యం, ప్రభుత్వం విజ్ఞప్తుల మేరకు ఏడాదిపాటు తాము సహనం పాటించామని జేఏసీ నేతలు తెలిపారు. సమ్మె నిర్ణయానికి యాజమాన్యం, ప్రభుత్వమే కారణమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా తమ సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. జేఏసీ అత్యవసర సమావేశంలో జాయింట్ సెక్రటరీలు శ్యామ్ మనోహర్, వెంకన్న గౌడ్, సుధాకర్‌గౌడ్, తులసి నాగరాణి, ఫైనాన్స్ సెక్రటరీ కరుణాకర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సదానందం, నారాయణనాయక్, నెహ్రూ, నాగరాజు, సత్యనారాయణరావు, మోజెస్, గిరిధర్, చంద్రుడు, ఖాజామొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.