Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగం స్థానంలో మనుధర్మం అమలుకు కుట్ర : తమ్మినేని
బీజేపీ ఏ మాత్రం హిందువుల మేలు కోరే పార్టీ కాదనీ, ఎస్సీ, ఎస్టీ, బీసీల వ్యతిరేకమైనదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ఆ పార్టీ రిజర్వేషన్లు ఉండొద్దని కోరుకుంటున్నదని విమర్శించారు. ప్రజలపై బీజేపీ రుద్దాలని చూస్తున్న భావజాలం ఎంత నష్టదాయకమో జనచైతన్య యాత్రల ద్వారా ప్రజలకు వివరించామన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రజల ఖాతాల్లో నల్లధనం డబ్బులు వేయటం, 2022 కల్లా అందరికీ ఇండ్లు, రైతుల ఆదాయం రెట్టింపు, పారిశ్రామిక అభివృద్ధి, తదితర హామీలేమయ్యాయని ప్రశ్నించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం స్థానంలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తలు ప్రతిపాదించిన మనుధర్మశాస్త్రాన్ని అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. కుల వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగిన ఈ గడ్డపై మధ్యయుగాల సంస్కృతిని అడుగుపెట్టనివ్వబోమన్నారు. ఏప్రిల్ 9న హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సీపీఐ-సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సంయుక్త సభ నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. పోడు భూములకు పట్టాలివ్వకుంటే ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇప్పటికే తమకు వచ్చిన వివిధ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.