Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
పదేండ్ల క్రితం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసు స్టేషన్ల పరిధుల్లో ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసి పరారైన మోసగాడిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన వి. చెన్నయ్య పదేండ్ల క్రితం వరంగల్ జిల్లాలో కొందరు పాస్టర్ల సహకారంతో ట్రస్టును తెరిచాడు. అందులో పదిన్నర వేల రూపాయలు కట్టి సభ్యులైన వారికి నెలకు రెండున్నర వేల రూపాయల చొప్పున పెన్షన్‌ను చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. ఆ విధంగా వరంగల్‌తో పాటు హైదరాబాద్‌లోని ఘట్కేసర్, ఉప్పల్, మోయినాబాద్తో పాటు మొత్తం 14 పోలీసు స్టేషన్ల పరిధులలో అమాయక ప్రజల నుంచి రూ. 6 కోట్లను సేకరించాడు. తర్వాత సభ్యులకు పెన్షన్ చెల్లించకపోవడంతో 2012లో పోలీసులు చెన్నయ్యను అరెస్టు చేశారు. తర్వాత బెయిల్‌పై విడుదలైన చెన్నయ్య అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన సీఐడీకి చెందిన సంపత్ ఆధ్వర్యంలోని ప్రత్యేక టీం చెన్నయ్యను అరెస్టు చేశారు. ఈ కేసును దర్యాప్తు జరిపిన అధికారులను సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్ అభినందించారు.