Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్ శాంతికుమారి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహిళా జర్నలిస్టులకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే సంకల్పంతో ఏప్రిల్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని సమాచార కమిషనర్ కార్యాలయంలో మహిళా జర్నలిస్టుల ఆరోగ్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పరీక్షలతో మహిళా జర్నలిస్టులకు ఆర్థిక భారం లేకుండా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించే అవకాశం ఉందని చెప్పారు. సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన మహిళాజర్నలిస్టులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మహిళాజర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మాస్టర్ హెల్త్ చెకప్ల్లో భాగంగా రక్త పరీక్ష సీబీపీ, బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, విటమిన్ బీ12, డీ3, ఈసీజీ, ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్ స్మియర్ వంటి రోగనిర్ధారణ పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. స్క్రీనింగ్ పరీక్షలు, మెడికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్, ఐ స్క్రీనింగ్, డెంటల్ పరీక్షలు, గైనకాలజీ పరీక్షలు చేసి వాటి ఫలితాలను అదే రోజున అందజేస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి. అదనపు డైరెక్టర్ ఎల్.ఎల్.ఆర్.కిషోర్ బాబు, జాయింట్ డైరెక్టర్లు కె.వెంకటరమణ, డీ.ఎస్.జగన్, డి.శ్రీనివాస్, ఎం.మధుసూదన్, డిప్యూటీ డైరెక్టర్లు వై.వెంకటేశ్వర్లు, హష్మీ, పాండు రంగారావు, ప్రసాద్ రావు, సి.రాజారెడ్డి, ఎం.యామినీ, ఎ.సత్యనారాయణరెడ్డి, వి.రాధాకిషన్, మల్లయ్య, పి.జైరాం మూర్తి తదితరులు పాల్గొన్నారు.