Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజీపీ అంజనీకుమార్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో నమోదవుతున్న కేసులలో 60 శాతం సైబర్ నేరాలకు సంబంధించినవే ఉంటున్నాయనీ, వీటి తీవ్రత భవిష్యత్తులో మరింతగా పెరిగే ప్రమాదమున్నదని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ అన్నారు. సీఐడీ ఆధ్వర్యంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సైబర్ చట్టాలు, నేరాలపై న్యాయాధికారులకు జరుగుతున్న మూడ్రోజుల శిక్షణా శిబిరం ముగింపు సభకు డీజీపీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో హత్యలు, దోపిడీలు, దొంగతనాలు వంటి సాంప్రదాయక నేరాలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సైబర్ నేరాలు, చట్టాల పట్ల ప్రజలలో తగిన అవగాహన లేకపోవడం, సైబర్ సెక్యూరిటీ పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణాలుగా ఆయన విశ్లేషించారు. ఈ నేరాలపై సంబంధిత ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు సమాజంలోని అన్ని వర్గాలలో చైతన్యాన్ని తీసుకురావాల్సినవసరం ఉన్నదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు వంద మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సీఐడీ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, చట్టాలపై తగిన అవగాహనను కలిగిస్తూ శిక్షణనివ్వడం జరిగిందని ఆయన చెప్పారు. తాజాగా 33 మంది జూనియర్ సివిల్ జడ్జిలకు ఇందులో శిక్షణనివ్వడం జరిగిందని తెలిపారు. సైబర్ నేరాలను అరికట్టడంలో దర్యాప్తు అధికారులు, న్యాయాధికారులు సమన్వయంతో పని చేయాల్సినవసరం ఉన్నదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్‌తో పాటు పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.