Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
శంషాబాద్ వద్ద 2019, డిసెంబర్ 6న 'దిశ' కేసు నిందితుల ఎన్కౌంటర్ ఘటనలో పాల్గొన్న పోలీసులపై రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న సుప్రీంకోర్టు కమిషన్ నివేదికను పోలీసులు వ్యతిరేకిస్తూ బుధవారం హైకోర్టులో వాదించారు. పోలీసులపైనే హత్య కేసు పెడితే పోలీసు అధికారి జీవించే హక్కుకు భంగం కలిగినట్టే అవుతుందన్నారు. ఆర్టికల్ 21 కింద నిర్దేశించిన జీవించే హక్కు ప్రమాదంలో ఉన్నప్పుడు పౌరులు హైకోర్టుకు వస్తారని.. కానీ, కమిషన్ నివేదిక ఆధారంగా కేసు నమోదుకు హైకోర్టు ఆదేశిస్తే ఎలాగని ప్రశ్నించారు. ప్రభుత్వం తరఫున వాదించేందుకు గడువు కావాలని ఏజీ బీఎస్ ప్రసాద్ కోరడంపై హైకోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. విచారణను ఏప్రిల్ 12కు వాయిదా వేస్తూ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీల డివిజన్ బెంచ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సుమోటోగా స్వప్నలోక్ అగ్నిప్రమాదంపై కేసు
సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో ఈ ఏడాది మార్చి 16న జరిగిన అగ్నిప్రమాద ఘటనను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా స్వీకరించింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారని పత్రికల్లో వచ్చిన వార్తను సుమోటో పిల్‌గా పరిగణించింది. 2011లో స్వప్నలోక్‌లో అగ్నిప్రమాదం జరిగిన తర్వాత కూడా స్వప్నలోక్ నిర్వాహకులు ఫైర్‌సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదని, రెండోసారి జరిగిన ప్రమాదంలో ఆరుగురు మరణించారని పత్రికల్లో వచ్చిన వార్తను హైకోర్టు పిల్‌గా స్వీకరించింది.
మార్గదర్శిపై స్టేటస్కో
మార్గదర్శిపై ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో భాగంగా బ్రహ్మయ్య అండ్ కో దాఖలు చేసిన పిటిషన్లో హైకోర్టు స్టేటస్కో ఆర్డర్ జారీ చేసింది. ఏపీ పోలీసులు తమ సంస్థలో తనిఖీలు చేపట్టడం, ఉద్యోగులను, భాగస్వాములను నిర్బంధించడాన్ని సవాల్ చేస్తూ బ్రహ్మయ్య అండ్ కో., పెద్ది చంద్రమౌళి వేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌ను హైకోర్టు బుధవారం రాత్రి 8 గంటలకు విచారణ చేపట్టింది. స్టేటస్కో ఉత్తర్వులను న్యాయమూర్తి జస్టిస్ విజరుసేన్‌రెడ్డి జారీ చేశారు. విచారణను 31కి వాయిదా వేశారు.
డ్రగ్స్ నిందితుల నిర్బంధం చెల్లదు
డ్రగ్స్ సరఫరా ఆరోపణల కేసులో గోవాకు చెందిన ఎడ్విన్ నూన్స్ ్ట విడుదలకు కింది కోర్టు ఉత్తర్వులు జారీ చేశాక, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నిర్బంధ ఉత్తర్వులు జారీ చేయడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్డిపిఎస్ చట్టంలోని 37(బి) (2) నిబంధన ప్రకారం క్రింది కోర్టు తగిన ఆదేశాలు ఇచ్చాక వాళ్లను నిర్బంధంలో కొనసాగించడం సరికాదంది. పిటిషనర్లకు రెండు షరతులను విధించింది. సత్ప్రవర్తనకు భరోసాగా పోలీస్ కమిషనర్ పేరిట ఏడాది పాటు రూ. లక్ష డిపాజిట్ చేసి అందజేస్తూ, ఎలాంటి నేరాలకు పాల్పడబోమని హామీ ఇస్తూ రెండు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.