Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరొకరి పరిస్థితి విషమం
నవతెలంగాణ -పరకాల
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. జిల్లాలోని శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన ఆటో ఉదయం 6:45 గంటలకు గ్రామం నుంచి 14 మంది వ్యవసాయ కూలీలతో పరకాల మీదుగా రేగొండ మండలం పోచంపల్లి గ్రామానికి మిర్చి ఏరటానికి రోజూ వెళ్తారు. అలా బుధవారం కూడా వెళ్తున్న క్రమంలో భూపాలపల్లి రోడ్ చలివాగు బ్రిడ్జి సమీపంలో మహారాష్ట్ర, సిరివంచ నుంచి వరంగల్‌కు వెళ్తున్న కారు.. అతివేగంగా వచ్చి ఆటోను ఢకొీట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న 14 మంది తీవ్ర గాయాలపాలై చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయారు. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు వెనువెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ ప్రశాంత బాబు.. గాయాలైన వ్యవసాయ కూలీలను తన వాహనం, మరో ప్రయివేటు వాహనంలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని 108 ద్వారా వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించగా కొంగరి చేరాలు (60) దుబాసి కోమల (58) పరిస్థితి విషమించి మృతిచెందారు. తీవ్ర గాయపడిన వారికి పరకాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇందులో చేతులు, కాళ్లు, నడుము, తలకు తీవ్ర గాయాలై చికిత్స పొందుతున్న వారి రోదనలతో ఆస్పత్రి మిన్నంటింది. గతంలో సైతం ప్రతిపాక నుంచి మిర్చి ఏరడానికి కూలీలు వాహనం మాందారిపేట మూలమలుపు వద్ద ఢకొీట్టిన సంఘటన మరువకముందే మళ్లీ జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువులు, ఆటో డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.