Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు మంగళవారాల్లో 19 వేల మందికిపైగా స్క్రీనింగ్
- ఈ నెల 28న రికార్డు స్థాయిలో 7,965 మందికి పరీక్షలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని మహిళలంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు అమలు చేస్తున్న 'ఆరోగ్య మహిళ' కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రతి మంగళవారం మహిళలకు మాత్రమే వైద్య పరీక్షలు జరిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 100 'ఉమెన్ స్పెషల్ క్లినిక్స్'ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మూడు మంగళవారాల్లో మొత్తం 19వేల మందికిపైగా మహిళలకు వైద్య పరీక్షలు జరిగాయి. 'మహిళ ఆరోగ్యం-ఇంటి సౌభాగ్యం' అనే లక్ష్యంతో ఈ వైద్య కేంద్రాల్లో మహిళలు ఎదుర్కొంటున్న 8 ప్రధాన ఆరోగ్య సమస్యలకు సంబంధించి పరీక్షలు చేసి, చికిత్సను అందిస్తున్నారు. మహిళలు తీరిక లేకనో, భయం కారణంగానో, సరైన అవగాహన లేకనో, సొంతంగా ఆస్పత్రికి వెళ్లలేకనో, ఇతర కారణాలతోనో తమ అనారోగ్య సమస్యలను బయటపెట్టుకోరు. దీంతో వారి ఆరోగ్య సమస్యలు ముదిరి, పెద్ద వ్యాధులకు దారి తీస్తున్నట్టు గుర్తించారు. ఇలాంటివారికి 'ఆరోగ్య మహిళ' కార్యక్రమం కొండంత భరోసా ఇస్తున్నది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల ఎనిమిదిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కరీంనగర్లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 14వ తేదీ నుంచి ఆరోగ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి వారం 4,793 మంది మహిళలు తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ నెల 21న 6,328 మంది వచ్చారు. ఓపీ 32 శాతం పెరిగింది. 28వ తేదీన మరింత పెరిగి 7,965 మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. అంతకుముందు వారంతో పోల్చితే 26 శాతం పెరిగింది. మూడు మంగళవారాల్లో కలిపి 10 వేలకుపైగా నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. మొదటివారం 2,723 నమూనాలను సేకరించగా, రెండో వారం 2,792 నమూనాలను, మూడోవారం 4,727 నమూనాలను సేకరించి తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌కు పంపించారు. ఈ ఫలితాలు 24 గంటల్లోనే వారికి అందుతున్నాయి. ఈనెల 28న 7,965 మంది మహిళలు రాగా వారికి పలు రకాల పరీక్షలు నిర్వహించి, 603 మందిని చికిత్స నిమిత్తం పెద్దాస్పత్రులకు రెఫర్ చేశారు.
మహిళలు సద్వినియోగం చేసుకోవాలి
- వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు అమలు చేస్తున్న 'ఆరోగ్య మహిళ'ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న 8 రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించి వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. అక్రిడేటెడ్ మహిళా జర్నలిస్టులకు కూడా ప్రత్యేక వైద్య శిబిరాన్ని హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్‌లో సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసినట్టు చెప్పారు.