Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు నిందితుల ఐదు రోజుల కస్టడీ
- ముగ్గురితోపాటు గ్రూప్-1 అభ్యర్థులను ప్రశ్నించిన అధికారులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బుధవారం ముగ్గురు నిందితులతోపాటు గ్రూప్-1 అభ్యర్థుల వివరాలను సిట్ సేకరించింది. నాంపల్లి కోర్టు ముగ్గురు నిందితులకు ఐదురోజుల పోలీస్ కస్టడీకి అనుమతివ్వడంతో షమీమ్, సురేష్, రమేశ్‌ను సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులు కావడంతో వీరి పాత్ర కీలకంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మొదటి రోజు విచారణలో భాగంగా పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్, డాక్యానాయక్, రేణుకతో వీరికి ఉన్న సంబంధాలపై ఆరా తీసినట్టు తెలిసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో షమీమ్‌కు 126 మార్కులు రాగా, రమేశ్‌కు 122, సురేశ్‌కు 100కుపైగా మార్కులు వచ్చిన విషయం తెలిసిందే. రాజశేఖర్, ప్రవీణ్ నుంచి ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రాన్ని తీసుకున్న ముగ్గురు నిందితులు ఇంకెవరికైనా ఇచ్చారా అనే కోణంలో విచారించినట్టు తెలిసింది. ముగ్గురు నిందితులను వేర్వేరుగా ప్రశ్నించిన అధికారులు కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది.
టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లారా...
గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 100 కంటే అధిక మార్కులు సాధించిన అభ్యర్థుల లిస్ట్ తయారు చేసిన సిట్ అధికారులు వారికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం దాదాపు 40 మంది అభ్యర్థులు సిట్ కార్యాలయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు 20 అంశాలతో కూడిన ప్రశ్నలపై వారి నుంచి సమాధానాలు సేకరించినట్టు తెలిసింది. మరింత లోతుగా విచారించిన అధికారులు మొత్తం విచారణను రికార్డు చేశారు. కొన్ని పత్రాలను సైతం నింపించినట్టు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లారా, వెళ్తే ఎన్నిసార్లు వెళ్లారు, ఎప్పుడు వెళ్లారు, ఎవరిని కలిశారు, ఎందుకు కలిశారు.. అనే కోణంలో దర్యాప్తు కొనసాగినట్టు తెలుస్తోంది. వీరిని ప్రశ్నించిన అధికారులు టీఎస్పీఎస్సీ కార్యాలయంలోని ఎంట్రీ రిజిస్ట్రర్‌ను పరిశీలించినట్టు సమాచారం.
84మందిని ప్రశ్నించిన అధికారులు
సిట్ అధికారులు 9మంది నిందితులతోపాటు మరో ఆరుగురిని ఇప్పటి వరకు విచారించారు. అంతేకాకుండా గ్రూప్ ప్రిలిమ్స్ రాసిన మరో 84 మందిని ప్రశ్నించిన అధికారులు వారి నుంచి పూర్తి వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఏఈ ప్రశ్నాపత్రం దాదాపు 12మందికి, గ్రూప్-1ప్రిలిమ్స్ పేపర్ ప్రవీణ్‌తోపాటు రాజశేఖర్, షమీమ్, రమేశ్, సురేశ్ ఐదుగురికి చేరినట్టు సిట్ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. కస్టడీకి తీసుకున్న ముగ్గురు నిందితులను నాలుగు రోజులపాటు విచారిస్తే మరింత సమాచారం వస్తుందని ఓ సీనియర్ పోలీస్ అధికారి అభిప్రాయపడ్డారు.