Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేడుకకు సిద్ధమైన భద్రాచలం
- పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
- రెండు రాష్ట్రాల గవర్నర్ల రాక
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణానికి ముస్తాబయింది. మిధుల ప్రాంగణంలో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు సీతారాముల పరిణయ వేడుక జరగనుంది. ఈ అపురూప సన్నివేశం వీక్షించడానికి దేశనలుమూలల నుంచి లక్షలాది మంది సందర్శకులు భద్రాద్రికి చేరుకుంటున్నారు. దీని కోసం కల్యాణం జరిగే ప్రాంగణంలో ప్రతి సెక్టార్లో ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు. సేవలు పర్యవేక్షణకు ప్రతి సెక్టార్‌కు ప్రత్యేక అధికారులను కేటాయించారు. అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా, కరోనా నేపథ్యంలో మూడేండ్లుగా భక్తులకు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు భక్తుల సమక్షంలో వేడుక నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా తిరు కళ్యాణ మహోత్సవం, పుష్కర పట్టాభిషేకానికి నిధుల కొరత లేకుండా ఉండేందుకు సీఎం ప్రత్యేక నిధి నుంచి సీఎం కేసీఆర్ రూ.కోటి విడుదల చేశారు. సందర్శలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సీఎంఓ కార్యాలయం నుంచి అధికారులను ఆదేశించారు. జిల్లా మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు పలు సూచనలు చేశారు.
వివిధ శాఖల ఆధ్వర్యంలో సేవలు
రామయ్య కల్యాణానికి వచ్చే సందర్శకులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వివిధ శాఖలు సమన్వయంతో సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన పోలీసు అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే ప్రథమ చికిత్స నిర్వహించి ఆదుకునేందు కు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటుచేసింది. తాగునీటి కోసం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రధాన కూడలి వద్ద చలివేంద్రాలు అధికారులు ఏర్పాటు చేశారు. భక్తులు తలంబ్రాల కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రధాన కూడళ్ళు వద్ద దేవస్థానం ఆధ్వర్యం లో కౌంటర్లు ఏర్పాటు చేసి ఉచితంగానే భక్తులకి ప్యాకెట్లను అందించేందుకు సిద్ధమయ్యారు. ఏదేని అత్యవసర సేవలకు భద్రాచలం ఆర్డిఓ కార్యాలయంలో 08743-232444 కంట్రోల్ రూము ఏర్పాటు చేశారు.
ఉత్సవాలకు ప్రముఖుల రాక
రామయ్య కల్యాణం, పట్టాభిషేక ఉత్సవాలకు తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజరుకుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావుతోపాటు ఎంపీలు మాలోత్ కవిత, నామా నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తదితర ప్రముఖులు రానున్నారు. శ్రీ సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు ప్రభుత్వం తరుఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమర్పించనున్నారు. ప్రముఖులకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు రానున్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే అధికారులు ఏర్పాట్లు చేశారు.