Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంచిన సీఎం కేసీఆర్
- దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ను బలపర్చాలి
- బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-నంగునూరు
బీజేపీ అంబానీ, అదానీ ఆదాయం పెంచే ప్రయత్నం చేస్తే, సీఎం కేసీఆర్ రైతుల ఆదాయం పెంచుతున్నారని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మోడీ నల్లధనం తెచ్చి రూ.15 లక్షలు ప్రతి అకౌంట్లో వేస్తామని చెప్పారని ఆరోపించారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుందన్నారు. కేసీఆర్ సంపద పెంచి పేదలకు పంచితే.. బీజేపీ వాళ్లు పేదల వద్ద పన్నులు గుంజి అదానీకి పెడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టాలంటే తాము పెట్టమని సీఎం తెగేసి చెప్పారని గుర్తు చేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని నల్ల పోచమ్మ ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఆనగోని లింగం గౌడ్ అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీని దేశ వ్యాప్తంగా బలపరచడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ గులాబీ జెండా నంగునూరు నుండే ప్రారంభించారని, ఈ మండలం నుంచి కేసీఆర్ సైకిల్ తొక్కారని, ఇక్కడి ప్రజల దీవెనలతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు. కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలో లంచాలు ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్లు బిగించేవారని, నేడు ఆ పరిస్థితి లేదన్నారు. నీళ్లగోస లేకుండా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు ఇస్తున్నామన్నారు. కాళేశ్వరం ద్వారా 18 వేల ఎకరాలకు నీరు అందిస్తున్నామని తెలిపారు.