Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్షేమానికి నాంది పలికింది మేమే
- ఆవిర్భావ సభలో చంద్రబాబు
- కాసానికి అభినందన
- బీసీలకు న్యాయం చేసింది టీడీపీనే:జ్ఞానేశ్వర్
- టీడీపీతోనే అభివృద్ధి : అచ్చెన్నాయుడు
- ఘనంగా వేడుకలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
సంక్షేమానికి నాంది పలికిన తెలుగుదేశం పార్టీ అని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అన్నారు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని వ్యాఖ్యానించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని అనాడే యుగపురుషుడు ఎన్టీఆర్ అన్నారని గుర్తు చేశారు. బుధవారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 41వ టీడీపీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ 41 సంవత్సరాల క్రితంచరిత్రను తిరగరాసిన రోజు మార్చి 29. అధికారం కావాలని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాలేదు.తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలని పార్టీ పెట్టారు.తెలుగుజాతి కోసం స్థాపించిన పార్టీ టీడీపీ అని చెప్పారు. తెలుగుజాతి వసుధైక కుటుంబంగా ఉండటం మనందరి అదృష్టం. మానవత్వమే తన సిద్ధాంతమని ఆనాడు ఎన్టీఆర్ చాటి చెప్పారని వివరించారు. ఎన్టీఆర్ తెచ్చిన పరిపాలనా సంస్కరణలు చరిత్రలో ఎక్కడా లేవు.సంక్షేమానికి నాంది పలికి పార్టీ టీడీపీ. సంస్కరణలకు మారుపేరు ఎన్టీఆర్ అని అన్నారు. హైదరాబాద్‌కు ధీటుగా అమరావతి నిర్మాణం చేపట్టాం.అమరావతి రైతులు 33 వేల ఎకాల భూమి స్వచ్ఛందంగా ఇచ్చారు. విభజన కంటే జగన్ వల్ల ఎక్కువ నష్టం జరిగింది.సైకో అనాలా ? దద్దమ్మ అనాలా ? చేతకాని వ్యక్తి అనాలా ? రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పుట్లాడు అనాలో అర్థం కావడం లేదు. ఏపీలో పరిస్థితి చూస్తే బాధేస్తున్నది. 30 ఏండ్ల అభివృద్ధి వెనక్కి వెళ్లింది. పులివెందులలో తుపాకీ సంస్కృతి వచ్చింది. మొన్న గొడ్డలి..ఇప్పుడు తుపాకీ..గంజాయి. తెలుగుదేశం చారిత్రక అవసరం తెలుగువారందరికి ఉంది. రాష్ట్రంలో తిరుగుబాటు ప్రారంభమైంది. గ్రాడ్యుయేట్స్‌లో తిరుగుబాటుకు మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం. మళ్లీ ఏపీలో అధికారంలోకి వస్తాం.రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తెస్తాం.
తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకు రావాలి. తెలంగాణకు తెలుగుదేశం అవసరం. తెలుగుజాతికి గ్లోబల్ లీడర్స్‌గా తయారుచేయాలన్న సంకల్పం తీసుకుంటున్నా. 2047 నాటికి ప్రపంచం లోనే పవర్‌పుల్ కమ్యూనిటీగా తెలుగుజాతి ఉండా లనీ, అందుకోసం కృషిచేయాలనేది నా సంకల్పం. 12 శాతం జనాభా రోజుకు రూ.150 అర్జిస్తుండటం బాధగా ఉంది. ఒకశాతం జనాభా 62 శాతం సంపద అనుభవించే పరిస్థితి వచ్చింది. అందరూ కలిసి నిరుపేదలకు అండగా ఉండాలి. ప్రతిఒక్కరూ మరొకరికి సహకరించాలి. పేదలను దత్తత తీసు కోవాలి. ఆర్థిక అసమానతలు తగ్గించడానికి నాంది పలుకుతాం. సంపద సృష్టించడమే కాదు పేదలకు పంచడం కూడా టీడీపీకి తెలుసు. పేదవాడిని కోటీ శ్వరుడిని చేసే బాధ్యత సమాజానిది. అందుకోసం ప్రణాళిక తయారుచేస్తా. ఉక్కు సంకల్పంతో చేసి చూపిస్తాం. జగన్ మాదిరి దొంగలు వస్తే రాష్ట్రానికి ఏం చేస్తారు ? సుపరిపాలనకు నాంది పలికిన పార్టీకి సహకరించాలి. ప్రజలతో పార్టీ నడపాలనేది నా సం కల్పం. మంచివారిని ప్రోత్సహిస్తే సమాజానికి మంచి జరుగుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
బీసీలకు ప్రాధాన్యత:కాసాని జ్ఞానేశ్వర్
హైదరాబాద్ నడిబొడ్డున ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. కేవలం తొమ్మి ది నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌ది అని అభిప్రాయపడ్డారు. పేదలకు న్యాయం చేసేది టీడీపీనేనని వ్యాఖ్యానించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది టీడీపీనే అని చెప్పారు. ప్రజలకు వద్దకు పాలన, జన్మభూమి వంటి పథకాలతో సుపరిపాలన అందించినట్టు చెప్పారు. పేదలకు లక్షలాది ఇండ్లు కట్టించిన చరిత్ర టీడీపీది అని గుర్తు చేశారు. మండల వ్యవస్థను ప్రవేశపెట్టి పరిపాలన ప్రజల ముంగిటకు తెచ్చిన చరిత్ర ఎన్టీఆర్దేనని వ్యాఖ్యా నించారు. కడుపునిండా అన్నంపెట్టేందుకు కిలో రూ. 2 బియ్యం అందుబాటులో తెచ్చారని చెప్పారు. చంద్రబాబు చేసిన అభివృద్ధితోనే నేడు హైదరాబాద్ ప్రపంచపటంలో చేరిందని అభినందించారు. అనాడు నాటిన విత్తనాలు, నేడు ఫలితాలు ఇస్తున్నాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళుతున్నామనీ, గతంలో టీడీపీ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రజల దృష్టికి తీసుకెళుతున్నామని చెప్పారు. విజన్ 2050 ప్రణాళిక రూపొందించాలని కోరా రు. చంద్రబాబు మరసారి సీఎం కావాలని ఆకాంక్షించారు. బీసీలు, యువత, మహిళలు కదలడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలుగుజాతికి పండుగ రోజు:అచ్చెన్నాయుడు
యావత్ తెలుగుజాతికి ఈరోజు పండుగరోజని తెలుగుదేశం ఏపీ అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు అన్నారు. ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగింది. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత తెలుగు జాతి చరిత్ర మారింది. పసుపు జెండా అంటే ఆత్మగౌరవమని గుర్తించాలి. ఎన్టీఆర్ వచ్చాక తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగు వచ్చింది. హైదరాబాద్ నగరం విదేశాలతో పోటీ పడటానికి కారణం చంద్రబాబు. ఏపీకి ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రుల దురదృష్టకరం. చంద్రబాబును మళ్లీ సీఎం చేయడానికి ఏపీలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో జగన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. రాష్ట్రం విడిపోయినా తెలుగువారు అభివృద్ధి చెందాలనేదే చంద్రబాబు అభిమతని అన్నారు.
కాసానికి అభినందన
తెలంగాణలో పార్టీని వేగంగా ప్రజల్లోకి తీసుకెళుతున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ను చంద్రబాబును అభినందించారు. పార్టీని ఐక్యంగా నడిపించడం శుభపరిణామమని చెప్పారు.
ఎన్టీఆర్‌కు మరణంలేదు....బాలకృష్ణ
టీడీపీని స్థాపించి ఒక రాజకీయ విప్లవం తెచ్చారనీ, అందరిలోనూ చైతన్యం తీసుకుకవచ్చారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ పాలనలో ఎన్నో సాహసోపేతమైన పతకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. పేదల ఆకలి తెలిసిన వ్యక్తి ఎన్టీఆర్. ప్రతి తెలుగుబిడ్డ సగర్వంగా తలెత్తుకునేలా చేశారు. ప్రజల భవితకు భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్ నవజాతికి మార్గదర్శకం. యువతకు ఆదర్శం. ఎన్టీఆర్‌కు మరణం లేదని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీ రామ్మోహన్నాయుడు, నిమ్మల రామనాయుడు, అర్వింద్కుమార్గౌడ్, టి.జ్యోత్స్న, కాసాని వీరేశ్, బియ్యని సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
భారీగా ఏర్పాట్లు
ఆవిర్భావ దినోత్సవం కోసం టీటీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానశ్వర్ భారీ ఏర్పాట్లు చేశారు. నగరంలోని ముఖ్యమైన కూడళ్లల్లో కటౌట్లు కనిపించాయి. ఎక్కడ చూసినా ప్లెక్సీలు, జెండాలు, బ్యానర్లూ ఉన్నాయి. వేలాది మంది ఆవిర్భావ సభకు హాజరయ్యారు. తెలంగాణ నుంచేగాక ఏపీ నుంచి కూడా సభకు వచ్చారు. వేదికపైనే దాదాపు రెండు వందల మంది కూర్చున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భారీ వేదికను ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు ఘనస్వాగతం పలికారు.