Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీకి పేదలు కనిపించరా... !
1 శాతం సంపన్నుల వద్దే 40 శాతం సంపద. అదానీ ఆస్తులు రూ.50 వేల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్లకు ఎలా పెరిగాయి.. విచారణకు ఎందుకు భయపడుతున్నారు?. తెలంగాణలో బీజేపీ కుట్రలను వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులు తిప్పికొట్టాలి. మతతత్వ, కార్పొ రేట్ అనుకూల విధానాలను ఎండగట్టాలి. దేశానికి దారి చూపే యాత్ర ఇది
- జనచైతన్య యాత్ర ముగింపు సభలో ప్రకాశ్ కరత్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హిందువులంటే అదానీ, అంబానీలేనా?అని బీజేపీ, ఆర్ఎస్ఎస్ను సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్కరత్ ప్రశ్నించారు. వారి సంక్షేమం కోసమే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పనిచేస్తున్నదని విమర్శించారు. హిందువుల్లో భాగమైన పేదలు, ఎస్సీ,ఎస్టీ, ఓబీసీలు బీజేపీకి కనిపించరా?అని అడిగారు. నిరుద్యోగం, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పేదలు సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలకు పన్ను రాయితీలు కల్పిస్తూ సామాన్యులపై భారాలు మోపుతున్నదని చెప్పారు. ప్రజల మధ్య మతచిచ్చును రెచ్చగొడుతున్నదని అన్నారు. మతతత్వం, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలనీ, ఈ అదానీ, అంబానీ ప్రభుత్వాన్ని కూల్చాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ ప్రమాదం పట్ల ప్రజలను మేల్కొల్పేందుకు చేపట్టిన ఈ యాత్ర దేశానికే దారి చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 17న వరంగల్‌లో ప్రారంభమైన జనచైతన్య యాత్ర ముగింపు సభ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బుధవారం జరిగింది. వేలాది మంది ప్రజలు హాజరై ఈ సభను విజయవంతం చేశారు.
ముఖ్యఅతిథిగా హాజరైన ప్రకాశ్కరత్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చాక అనేక ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయని చెప్పారు. కానీ బీజేపీ ప్రభుత్వం హిందూత్వ పేరుతో మతతత్వాన్ని రెచ్చగొడుతూ, కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంభిస్తున్నదని విమర్శించారు. తొమ్మిదేండ్లలో ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి దేశాన్ని లూటీ చేసిందన్నారు. గతంలో టాటా, బిర్లా ప్రభుత్వం అనే వాళ్లమనీ, ఇప్పుడు అదానీ, అంబానీ ప్రభుత్వంగా మారిపోయిందని చెప్పారు. దేశంలోని సహజ వనరులను కేంద్రం అదానీ, అంబానీలకే కట్టబెడుతున్నదని విమర్శించారు. అదానీ అక్రమ సంపాదనపై సమాధానం చెప్పలేక పార్లమెంట్‌ను పదేపదే వాయిదా వేస్తున్నారని వివరించారు. 2014లో అదానీ ఆస్తులు రూ.50 వేల కోట్లుండేవనీ, మోడీ ప్రధాని అయ్యాక ఇప్పుడు రూ.10.3 లక్షల కోట్లకు పెరిగాయని చెప్పారు. ఇంత తక్కువ కాలంలో అంత సంపద ఎలా పెరిగిందని ప్రశ్నించారు. 2014లో అదానీ ప్రపంచ కుబేరుల్లో 609వ స్థానంలో ఉంటే ఇప్పుడు రెండో స్థానానికి ఎలా చేరుకున్నారని అడిగారు. మోడీ అండగా ఉండడం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. ఈ అక్రమ సంపాదనపై దర్యాప్తు సంస్థలు పట్టించుకోవడం లేదనీ, పార్లమెంటులో చర్చకు కేంద్రం అంగీకరించడం లేదని చెప్పారు. దేశంలో అసమానతలు పెరుగుతు న్నాయని అన్నారు. ఒక శాతం సంపన్నుల వద్ద 40 శాతం సంపద కేంద్రీకృతమై ఉందన్నారు. ప్రజల సంక్షేమం కోసం మోడీ ప్రభుత్వం పనిచేయడం లేదని విమర్శించారు. ఉద్యోగాలు కల్పించడం లేదనీ, కార్మికులకు కనీస వేతనాలివ్వడం లేదనీ, అందరికీ విద్యావైద్యం కల్పించడం లేదని చెప్పారు. కానీ కార్పొరేట్లకు మాత్రం అనేక రాయితీలు కల్పిస్తున్నదని విమర్శించారు. అమెరికా సహా అనేక అభివృద్ధి చెందిన దేశాలు సంపన్నులపై పన్నులు వేస్తున్నాయనీ, కానీ భారత్‌లో మాత్రం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను పెంచి సామాన్యులపై భారాలు మోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టానికి నిధుల కేటాయింపులో కేంద్రం 33 శాతం కోత విధించిందని వివరించారు. సమాజంలో అంతరాలు తొలగిపోవాలంటే విధానాలు మారాలన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందూత్వ ఎజెండా పేరుతో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని చెప్పారు. ప్రతిపక్ష ముక్త భారత్‌ను మోడీ కోరుకుంటున్నారని విమర్శించారు. అందులో భాగంగానే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేశారని అన్నారు. ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని ఈడీ, సీబీఐ దాడులు చేస్తూ కేసులు బనాయిస్తున్నదని చెప్పారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, బీఆర్ఎస్ నేత కవితను విచారిస్తున్నారనీ, ఢిల్ల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్టు చేశారనీ వివరించారు. రాజ్యాంగమంటే గౌరవం లేకుండా ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. న్యాయవ్యవస్థను కూడా కేంద్రం చెప్పుచేతుల్లో పెట్టుకునేందుకు కుట్రలు చేస్తున్నదని చెప్పారు. ప్రతిపక్షాల్లోనే అవినీతిపరులున్నారంటున్న బీజేపీ వారంతా ఆ పార్టీలో చేరితే నీతిమంతులుగా మారిపోతారా?అని ప్రశ్నించారు. అసోం సీఎం హేమంత బిశ్వశర్మ కాంగ్రెస్‌లో ఉన్నపుడు సీబీఐ కేసు పెట్టిందనీ, బీజేపీలో చేరాక ఆ కేసుల్లేవని గుర్తు చేశారు. బీజేపీ భారతీయ జనతా వాషింగ్ మెషీన్‌లాగా మారిపోయిందన్నారు. ఎంతటి అవినీతిపరులైనా ఈ వాషింగ్ మెషీన్‌లోకి వెళ్తే నీతిపరులైపోతారని చమత్కరించారు. బీజేపీ తెలంగాణపై కన్నేసిందని, ప్రలోభాలు, డబ్బు, పదవులను ఆశ చూపి ఆ పార్టీ ఇక్కడ అధికారంలోకి రావాలని భావిస్తున్నదనీ, అది వస్తే ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు నాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఓబీసీలు, ఎస్సీ,ఎస్టీలు, మైనార్టీలు ఎక్కువుండే ఈ ప్రాంతంలో బీజేపీని అధికారంలోకి రాకుండా నిరోధించాలనీ, దాని కుట్రలను వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులన్నీ ఐక్యమై తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
బీజేపీ గారడీ మాటల్ని నమ్మి ఇంకా మోసపోదామా?: టి.జ్యోతి
బీజేపీ గారడీ మాటలతో మోసపోకుండా ప్రజలంతా తిరగడబడాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి.జ్యోతి పిలుపునిచ్చారు. మోడీ సర్కారు నిత్యావసరాల ధరలు పెంచి ప్రజల నడ్డివిరుస్తోందన్నారు. వరకట్నం, సతీసహగమనం వంటి రుగ్మతలు పోవాలని ప్రజలు కోరుకుంటుంటే..అవి సనాతన సంప్రదాయాల్లో భాగమేనని బీజేపీ ఎంపీలు నిస్సిగ్గుగా మాట్లాడటం బాధాకరమన్నారు. లైంగికదాడి కేసులో శిక్ష అనుభవిస్తున్నవారిని సత్పప్రవర్తన పేరుతో విడుదల చేయడం, బీజేపీ బహిరంగ సభల్లో కూర్చోబెట్టడం దుర్మార్గమన్నారు. కుల దురంహకార హత్యల నివారణ కోసం సమగ్ర చట్టం తేవాలనే డిమాండ్‌ను అటకెక్కించిందన్నారు. చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు ఏమైందని ప్రశ్నించారు.
మోడీ దేవుడు కాదు...రాక్షసుడు :
జూలకంటి రంగారెడ్డి
మోడీ ప్రజలకు దేవుడు కాదనీ, అంబానీ, అదానీలకు మాత్రమే దేవుడని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. ప్రజలపై భారాలు మోపుతున్న నవరూప రాక్షసుడని విమర్శించారు. ఇతర పార్టీల యాత్రలకు సీపీఐ(ఎం) చేపట్టిన జన చైతన్య యాత్రలకు చాలా తేడా ఉందని చెప్పారు.
దేశంలో త్రిబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో అనేక తగాదాలను సృష్టిస్తూ, భావోద్వేగాలను రెచ్చగొడుతూ బీజేపీ బలపడేందుకు యత్నిస్తున్నదని విమర్శించారు. కార్మికులు, రైతుల పొట్టగొట్టే విధంగా చట్టాలు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జి నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నరసింహారావు, చుక్క రాములు, మల్లులక్ష్మి, టి సాగర్, పాలడుగు భాస్కర్, ఎండీ అబ్బాస్, బృంద సభ్యులు ఎంవి రమణ, ఎస్ రమ, టి స్కైలాబ్‌బాబు, పి జయలక్ష్మి, పి ఆశయ్య, జగదీశ్, అడివయ్య, ఆర్ వెంకట్రాములు, లెల్లెల బాలకృష్ణ, అరుణజ్యోతి, బెల్లంకొండ వెంకటేష్, ఆనగంటి వెంకటేష్, కోట రమేష్, ధర్మానాయక్, విజరు, సోమన్న తదితరులు పాల్గొన్నారు.
కాషాయ పార్టీ ఆటలు సాగవ్ : పోతినేని
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిచిన గడ్డ ఇదనీ, ఇక్కడ బీజేపీ ఆటలు సాగవని సీపీఐ(ఎం) కార్యదర్శి వర్గ సభ్యులు, వరంగల్ నుంచి బయలు దేరిన యాత్ర బృందం నాయకులు పోతినేని సుదర్శన్ హెచ్చరించారు. ఈ యాత్ర 42 భారీ సభలు, 103 కార్నర్ మీటింగుల ద్వారా ప్రజలతో మమేకమైందని వివరించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటుతో ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలకు బీజేపీ పాతరేసిందని విమర్శించారు. రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలైన కోచ్‌ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదన్నారు.
బీజేపీవన్నీ..అబద్ధాలే : ఎస్ వీరయ్య
బీజేపీవన్నీ పచ్చి అబద్ధాలేనని ప్రజలు భావిస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఆదిలాబాద్ నుంచి బయలు దేరిన యాత్ర బృందం నాయకులు ఎస్ వీరయ్య చెప్పారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఎంపీలు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని తెలిపారు. బండి సంజరు మాట్లాడుతున్న తీరు ఆర్ఎస్ఎస్ లక్షణమని చెప్పారు. పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మిక హక్కులు కాలరాయబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పేదల గుండెల్లో ఎర్రజెండా పదిలం : జాన్‌వెస్లీ
పేదల గుండెల్లో ఎర్రజెండా పదిలంగానే ఉందని సీపీఐ(ఎం) కార్యదర్శి వర్గ సభ్యులు, నిజామాబాద్నుంచి బయలు దేరిన యాత్ర బృందం నాయకులు జాన్ వెస్లీ చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక న్యాయాన్ని, మహిళల హక్కుల్ని హరించి వేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈడీ, సీబీఐ ఎవరిని భయపెట్టినా..ఎర్రజెండాను భయపెట్టలేదని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కార్ కాదు కదా..ఏ ఇంజన్లనయినా ఆపే శక్తి ఎర్రజెండాకే ఉందన్నారు.
కమ్యూనిస్టులు ఎప్పటికీ పేదల పక్షమే : చాడ
నైజాం సర్కార్ మీద పోరాటం చేసి పేదలకు 10 లక్షల ఎకరాల భూములు పంచిన ఘన చరిత్ర కమ్యూనిస్టులదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. కమ్యూనిస్టులు ఎప్పటికీ పేదల పక్షపాతమేనని నొక్కి చెప్పారు. యూపీఏ-1 ప్రభుత్వా నికి మద్దతిచ్చి ఒత్తిడి పెట్టి మరీ అటవీ హక్కులు, ఉపాధి హామీ, సమాచార హక్కు, తదితర చట్టాలను కమ్యూనిస్టులు సాధించిన విషయాన్ని గుర్తుచేశారు. బీజేపీపై చేస్తున్న పోరాటంలో టీఆర్ఎస్కు మద్దతిచ్చినప్పటికీ ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు పల్లె పల్లెకు సీపీఐ పాదయాత్రలను చేపట్టనున్నట్టు తెలిపారు. రానున్న కాలంలో సీపీఐ, సీపీఐ(ఎం) ఐక్యపోరాటాలతో ముందుకుసాగుతా యన్నారు.