Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థి నిరుద్యోగుల భరోసాకై జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా
- లైబ్రరీ నుంచి కేయూ రెండో గేట్ వరకు భారీ ర్యాలీ
- వీసీ భవనం ముట్టడికి యత్నం
- వీసీ దిష్టిబొమ్మ దహనానికి యత్నం.. అడ్డుకున్న పోలీసులు
- పలువురు నాయకుల అరెస్టు
నవతెలంగాణ-హసన్‌పర్తి
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై విద్యార్థి, నిరుద్యోగ లోకం భగ్గుమన్నది. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి నిరుద్యోగుల భరోసాకై బుధవారం కేయూలో మహాధర్నా నిర్వహించారు. వందలాదిగా తరలివచ్చిన విద్యార్థులతో కేయూ లైబ్రరీ నుంచి రెండో గేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి వీసీ భవనం చేరుకొని ధర్నా చేశారు. వీసీ బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. వీసీ స్పందించకపోవడంతో విద్యార్థులు భవనం లోపలికి చొచ్చుకొనిపోయేందుకు యత్నించారు. విద్యార్థులు ఆగ్రహంతో భవనం కిటికీ అద్దాలు, పూల కుండీలను ధ్వంసం చేశారు. ఇద్దరు విద్యార్థులు భవనంపైకి ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న కేయూ పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని విద్యార్థులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, విద్యార్ధి ఉద్యమకారుల సంఘర్షణ సభకు కేయూ వీసీ అనుమతిస్తానని చెప్పి తీరా ఇవ్వకపోవడంతో విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయడంతో పోలీసులు భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకొని 12 మంది విద్యార్థి జేఏసీ నాయకులతో పాటు విద్యార్థులను బలవంతంగా అదుపులోకి తీసుకొని ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వివిధ విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. సభకు అనుమతి ఇస్తానని మాటతప్పిన వీసీ తాటికొండ రమేష్ తీరును నాయకులు తీవ్రంగా ఖండించారు. 30లక్షల మంది విద్యార్థి నిరుద్యోగుల భరోసాకై సంఘర్షణ సభను ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుతంగా నిర్వహించుకుంటామంటే నిర్బంధాలకు గురిచేయడం దుర్మార్గమని విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి నిరుద్యోగులకు ఉద్యోగాల నియామకాలపై నమ్మకం కలగాలంటే టీఎస్పీఎస్సీ కమిటీని రద్దు చేసి, చైర్మెన్, సభ్యులను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని కోరారు. నిరుద్యోగులకు ఉచిత మెటీరియల్, శిక్షణ, భోజన వసతి కల్పించాలన్నారు. 30లక్షల నిరుద్యోగులకు ఒక్కో నిరుద్యోగికి రూ.50వేలు అందించాలని తెలిపారు. ప్రభుత్వం, యూనివర్సిటీ అధికారులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో హైకోర్టును ఆశ్రయించి అనుమతి పొంది సభ నిర్వహించి తీరుతామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో కేయూ జేఏసీ చైర్మెన్ ఇట్టబోయిన తిరుపతి యాదవ్, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇడంపాక విజరు ఖన్నా, గిరిజన శక్తి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోత్ రాజు నాయక్, టీజీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడ రంజిత్ కుమార్, పీడీఎస్‌యూ రాష్ట్ర కోశాధికారి మొగిలి వెంకట్ రెడ్డి, బీఎస్ఎఫ్ కేయూ ఇన్చార్జి బొట్ల మనోహర్, ఎన్ఎస్యూఐ నాయకులు రాకేష్ కృష్ణన్, బీసీ విద్యార్థి సంఘం కె.యూ ఇంచార్జి అరెగంటి నాగరాజు, పీడీఎస్‌యూ కేయూ ఇన్చార్జి కామగోని శ్రవణ్ కుమార్, బీఎస్ఎఫ్ కేయూ ఇన్చార్జి కళ్లెపెళ్లి ప్రశాంత్, జాక్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.