Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తర్నం వంతెన కుంగుబాటుతో రాకపోకలు బంద్
- గ్రామాల మీదుగా వాహనాల మళ్లింపు
- నిరాల-లాండసాంగ్వి రోడ్డు అస్తవ్యస్తం
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి, జైనథ్
పచ్చని పంట పొలాల మధ్య అలరారిన ఆ గ్రామాల ఇప్పుడు దుమ్ము కమ్మేస్తోంది. రోజూ వందల సంఖ్యలో భారీ వాహనాల రాకపోకల కారణంగా రోడ్డు అస్తవ్యస్తంగా మారుతోంది. ఈ దారి గుండా ప్రయాణం నిత్యం నరకంగా మారింది. ఓ చోట బ్రిడ్జి కుంగిపోవడంతో అక్కడ రాకపోకలు నిలిపేసి ప్రత్యామ్నాయంగా గ్రామాల నుంచి మళ్లించడంతోనే సమస్య మొదలైంది. కానీ రాకపోకలు మళ్లించిన అదికారులు బ్రిడ్జి నిర్మాణంపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో గ్రామాలు దుమ్ము కొట్టుకుపోతున్నాయి. నిరాల నుంచి లాండసాంగ్వి వరకు సుమారు తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు దుస్థితి ఇది.
ఆదిలాబాద్ గ్రామీణం, జైనథ్ మండలాల పరిధిలోని లాండసాంగ్వి, అర్లి, అడ, ముక్తాపూర్, నిరాల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జైనథ్ మండలం తర్నం బ్రిడ్జి కుంగింది. రాకపోకలు నిలిచాయి. దీంతో ప్రత్యామ్నాయంగా మహారాష్ట్ర, బేల, జైనథ్ మండలా ల మీదుగా వచ్చే భారీ వాహనాలను నిరాల నుంచి లాండసాంగ్వి రోడ్డు మీదుగా నడిపిస్తున్నారు. గ్రామాల మధ్య అనుసంధానం కోసం నిర్మించిన చిన్న రోడ్డు కావడం.. భారీ వాహనాలు వెళ్తుండటం కారణంగా రోడ్డు అస్తవ్యస్తంగా మారింది.
ఎగిసిపడుతున్న దుమ్ము..!
ఆదిలాబాద్ జిల్లా సరిహద్దున మహారాష్ట్రలో సిమెంట్ పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. అక్కడి నుంచి సిమెంట్ ఇతరత్రా వస్తువుల రవాణా కోసం మన రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భారీ లారీలు వెళ్తుంటాయి. భోరజ్ నుంచి జైనథ్, బేల మండలాల మీదుగా మహారాష్ట్రకు వెళ్తుంటాయి. అక్కడ్నుంచి ఇదే మార్గం గుండా రావాల్సి ఉండగా మధ్యలో తర్నం బ్రిడ్జి వద్ద రాకపోకలు నిలిపివేయడంతో ఈ వాహనాలు నెలన్నర రోజులుగా నిరాల- లాండసాంగ్వి మీదుగా ప్రయాణిస్తున్నాయి. దీంతో రోజూ వందలాది లారీలు, ఆర్టీసీ బస్సులు, పెద్ద వాహనాలు ఇదే మార్గం గుండా వెళ్తుండటంతో భారీ ఎత్తున దుమ్ము లేస్తోంది. రోడ్డు కూడా గుంతలుగా ఉండటం.. ఎదురెదురుగా రెండు వాహనాలు వస్తే ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. తర్నం బ్రిడ్జి నిర్మాణం జాతీయ రహదారుల సంస్థ ఆధీనంలో ఉండటంతో వారే నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఈ బ్రిడ్జి నిర్మాణంపై ఎలాంటి కదలిక కనిపించడం లేదు.
రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు : పిడుగు స్వామి, జైనథ్
నిరాల వైపు నుంచి లాండసాంగ్వి మీదుగా ఆదిలాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఈ రోడ్డు కూడా గుంతలతో పూర్తిగా చెడిపోయింది. మరోపక్క ఇదే మార్గంలో భారీ వాహనాలు వెళ్తుండటంతో దుమ్ము రేగుతోంది. అధికారులు వెంటనే బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిచేయాలి.
పంటలు దెబ్బతింటున్నాయి
మా ఊరి పక్క నుంచి భారీ వాహనాలు వెళ్తున్నాయి. రోజూ వందల సంఖ్యలో వాహనాల రాకపోకల కారణంగా దుమ్ము రేగడంతో పంట పొలాలు దెబ్బతింటున్నాయి. ఎడ్లబండ్లపై కూడా వెళ్లలేని పరిస్థితి. కండ్లలో దుమ్ము పడుతోంది. అధికారులు ఈ రోడ్డును వెంటనే బాగు చేయించాలి.
- రైతు భవునే రాందాస్- అర్లి