Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి
- బీజేపీని వదిలించుకుంటేనే ధరాభారం నుంచి విముక్తి : పెట్రో ధరల దోపిడీపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కార్పొరేట్ కంపెనీలకు మేలు జరిగేలా పన్నులు తగ్గించి... సామాన్య ప్రజలను నిలువునా దోచుకుంటారా..? అని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అంతర్జాతీయ ముడిచమురు ధరలు తక్కువగా ఉన్నా, పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న మోడీ సర్కార్... దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 2013లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర 110 డాలర్లు ఉన్నప్పుడు, దేశంలో లీటర్ పెట్రోల్ రేటు కేవలం రూ.76 ఉండేదని గుర్తు చేశారు. ప్రసుతం బ్యారెల్ ముడిచమురు రేటు దాదాపు సగం పడిపోయినా మన దేశంలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.110 ఉండటమే కేంద్ర ప్రభుత్వ దోపిడీకి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. దేశంలో పెట్రోల్ ధరల పెంపునకు ముడిచమురు కారణం కాదనీ, మోడీ నిర్ణయించిన చమురు ధరలేననేది దీన్నిబట్టి మరోసారి రుజువైందని విమర్శించారు. ఈ మేరకు కేటీఆర్ గురువారం కేంద్రానికి లేఖ రాశారు.
పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచడం వల్ల దేశంలోని పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం ధరల భారంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నదని మంత్రి ఈ సందర్భంగా వాపోయారు. 2014 నుంచి ఇప్పటిదాకా దాదాపు 45శాతానికి పైగా పెట్రో ధరల పెంపు వల్ల సరుకు రవాణా భారమై, నిత్యావసరాల ధరలన్నీ భారీగా పెరిగాయని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల గత 45 యేండ్లలో ఎప్పుడు లేనంతగా పెరిగిన ద్రవ్యోల్బణం దేశాన్ని పట్టిపీడిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ అంతర్జాతీయ ముడి చమురు ధరల ప్రస్తావన, లేదా ఉక్రెయిన్- రష్యా యుద్ధం పేరు చెప్పి దేశ ప్రజలను ప్రధాని మోడీ మభ్యపెట్టారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న రూ.35 వేల కోట్ల ముడిచమురు పొదుపు ప్రయోజనమంతా కేవలం ఒకటి రెండు ఆయిల్ కంపెనీలకే దక్కిందనేది వాస్తవమని స్పష్టంచేశారు. దేశీయ వినియోగం పేరు చెప్పి భారీగా రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడిచమురును తిరిగి శుద్ధి చేసి విదేశాలకు అమ్ముకోవటం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఓ దోపిడీదారుగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాలకే పెట్రోలు అమ్ముతున్న ఆయిల్ కంపెనీలకు వస్తున్న లాభాలపై ప్రభుత్వానికి వచ్చే విండ్ ఫాల్ పన్నును ఎందుకు తగ్గించాల్సి వచ్చిందంటూ కేటీఆర్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 2013 సంవత్సరంలో ఉన్న స్థాయికి ప్రస్తుతం పడిపోయిన నేపథ్యంలో భారీగా పెంచిన, పెట్రోల్ రేటును అందుకనుగుణంగా తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ లాంటి రాష్ట్రాలు 2014 నుంచి ఒక్క రూపాయి వ్యాట్‌ను పెంచకున్నా, కేంద్ర ప్రభుత్వం మాత్రం సెస్సుల పేరుతో రూ.30 లక్షల కోట్లకు పైగా ప్రజల నుంచి కొల్లగొట్టిందని తెలిపారు. ఈ నేపథ్యంలో సెస్సులను పూర్తిగా ఎత్తివేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. జీఎస్టీ పరిధిలో ఉన్న వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.400 నుంచి రూ.1200కు పెంచిన అసమర్థ ప్రభుత్వమంటూ కేంద్రాన్ని విమర్శించారు. ధరల పెరుగుదల అంశం పార్లమెంటులో చర్చకు రాకుండా మోడీ సర్కార్ కుట్రలు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. సామాన్యులపై ఇలాంటి ధరాభారం తగ్గాలంటే బీజేపీని వదిలించుకోవడమే ఏకైక మార్గమని ఆయన తన లేఖలో ప్రజలకు సూచించారు.