Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోఠి మహిళా కళాశాల యూనివర్సిటీగా మార్పు
- ఓయూకు మహిళా కళాశాల ఎక్కడ ?
- దూర దృష్టి లోపించిన అధికారులు
- మరోచోట కొత్తగా ఏర్పాటు చేయాలని డిమాండ్
నవతెలంగాణ-ఓయూ
ఓయూ అస్తిత్వం నానాటికీ కుచించుకుపోతున్నది. గతంలో తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద విశ్వవిద్యాలయంగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నూతన యూనివర్సిటీల స్థాపనతో పరిధి కుచించుకుపోయింది. నూతనంగా తెలంగాణ ప్రభుత్వం కోఠి మహిళా కళాశాలను తెలంగాణ మహిళా యూనివర్సిటీగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇది హర్షించదగ్గ విషయం. అయితే ఓయూ విద్యార్థినుల అస్తిత్వానికి ప్రతీక అయిన కోఠి మహిళా కళాశాలను వదులుకోకుండా ఓయూ అధికారులు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేశారు. మరోచోట మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసి, కోఠి మహిళా కళాశాలను ఓయూ పరిధిలోనే ఉంచాలని కోరుతున్నారు.ఓయూ కోఠి మహిళా కళాశాలను సాంకేతికంగా వర్సిటీగా ఉన్నతీకరించడం మాత్రమే సరిపోదని, అందుకు అవసరమైన వసతులు కావాలని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. చారిత్రాత్మక కట్టడాలు, అపూర్వమైన వారసత్వపు సంపద ఆ ప్రాంగణంలో ఉన్న కారణంగా మహిళా యూనివర్సిటీ విస్తరణకు తగినంత అవకాశం లేదని పలువురు సూచిస్తున్నారు. ఓయూ కోఠి ఉమెన్స్ కళాశాలను వదులుకోవడమే కాదు ఇక్కడ ఘనమైన సాంస్కృతిక, చారిత్రక, వారసత్వ సంపదను ఓయూ అధికారులు వదులుకోవడం సరికాదని యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు, ఉద్యోగులు, పూర్వ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చేయిదాటిన కోఠి ఉమెన్స్ కాలేజ్..
ప్రభుత్వం మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసే క్రమంలో ఓయూ అధికారులు ఒక సుదీర్ఘ ప్రణాళికలతో ఆలోచించి, ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వం ముందుంచితే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోఠి మహిళా కళాశాల అస్థిత్వాన్ని ఓయూలోనే కొనసాగించాలని, ఎందుకంటే 104 సంవత్సరాల ఓయూ వారసత్వంలో కోఠి ఉమెన్స్ కళాశాల ఒక కలికితురాయని అభిప్రాయపడుతున్నారు. ఓయూ అధికారులు సరైన చర్చ జరిపి విద్యావంతుల నుంచి ప్రతిపాదనలు స్వీకరించి కోఠి ఉమెన్స్ కళాశాల ప్రాంగణాన్ని చేజారకుండా యథాతథంగా కళాశాలను ఇక్కడే కొనసాగించాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా, మహిళా యూనివర్సిటీకి అన్ని రకాల, నిధులు, నియామకాలు, వసతులు కల్పిస్తూ అధునాతన ప్రాంగణంలో అందరికీ అందుబాటులో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
యూనివర్సిటీ వ్యతిరేస్తున్నాం..
ఔట అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నూతనంగా 100 ఎకరాల్లో, వసతులు, నిధులు, నియామకాలు ఏర్పాటు చేసి యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. ఓయూ కోఠి ఉమెన్స్ కళాశాల బోర్డు మార్చి ఇలా చేయడం బాధాకరం.