Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐకేపీ కేంద్రాలను వెంటనే తెరవాలి
- సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆయకట్టు, బావుల కింద తొలుత నాటుపెట్టిన 1010 వరి ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మిర్యాలగూడ సబ్మార్కెట్ యార్డు పరిధిలోని దామరచర్లలో ఆయన పర్యటించారు. రైతులను కలిసి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వమే ఆ ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాలు, సహకార సంఘాల ద్వారా కొంటుందని వివరించారు. రైతులు మార్కెట్ యార్డులకు ధాన్యాన్ని తెచ్చి 10, 15 రోజులు కావస్తున్నా ఐకేపీ కేంద్రాలను ఇంత వరకు తెరవలేదని విమర్శించారు. దీంతో వారు వానకు తడిసి, ఎండకు ఎండి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులకు అక్కడ కనీస సౌకర్యాల్లేవని ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీరు, కరెంటు, రోడ్లు, టార్పాలిన్లు అందుబాటులో లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కనీస సౌకర్యాలను కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్టుగానే ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. ఐకేపీ కేంద్రాలను వెంటనే తెరవాలని, తద్వారా రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని సూచించారు.