Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిట్ విచారణ తేలేదెన్నడు?
నవతెలంగాణ-సిటీబ్యూరో
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు ఇప్పట్లో తేలేటట్టు లేదు. సిట్ విచారణలో తవ్వే కొద్దీ విషయాలు బయటకు వస్తున్నాయి. గురువారం ఉదయం రెండో రోజు పేపర్ లీకేజీపై ముగ్గురు నిందితులను సిట్ ప్రశ్నించింది. ఈ కేసులో నిందితుడు డాక్యానాయక్ ఏఈ పేపర్‌తో దాదాపు రూ.25లక్షలు వసూలు చేసినట్టు కీలక సమాచారం అందినట్టు తెలుస్తోంది. ఈ పేపర్ కోసం నీలేశ్, గోపాల్‌నాయక్ రూ.13.5 లక్షలు చెల్లించిన విషయం తెలిసిందే. అలాగే రాజేందర్ రూ.5 లక్షలు, ప్రశాంత్ రూ.7.5 లక్షలు చెల్లించినట్టు గుర్తించారు. ఏఈ ప్రశ్నాపత్రం కోసం ప్రశాంత్ బంగారం తాకట్టు పెట్టి మరీ రూ.7 లక్షలు తీసుకురాగా, మరికొందరు పొలాలు కూడా తాకట్టు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇంకా ఎంతమంది ఉద్యోగుల ప్రమేయం ఉందోనన్న కోణంలో సిట్ దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు సిట్ అధికారులు చేసిన దర్యాప్తు ప్రకారం ఏఈ పేపర్లు 12 మందికి, గ్రూప్-1 పేపర్లు ఐదుగురికి లీకైనట్టు విచారణలో తేలింది. 16 మందిని అరెస్టు చేశారు. విచారణ ఎప్పటిలోగా పూర్తి చేయాలన్నది గడువు లేకపోవడంతో విచారణ ఎప్పుడు తేలుతుందన్నది ప్రశ్నగా మిగిలింది. విచారణ ముగిసిన తర్వాతనే నివేదికను కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది.