Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలింపు
నవతెలంగాణ-ఖమ్మం
భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు బుధవారం(29న) ఖమ్మంలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దాంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఖమ్మంలోని తన నివాసంలో అస్వస్థతకు గురైన పువ్వాడకు తొలుత మమత ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయన కుమారుడు, మంత్రి పువ్వాడ అజరుకుమార్.. తన తండ్రికి మెరుగైన వైద్యం అందించేందుకు వెంటనే అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు. ఆయన కూడా హుటాహుటిన హైదరాబాద్ తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులు అంబులెన్స్‌కు అంతరాయం కలుగకుండా ఆ మార్గంలో గ్రీన్‌చానెల్‌ను ఏర్పాటు చేశారు. పువ్వాడ నాగేశ్వరరావుకు కిమ్స్ వైద్యులు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంచి పువ్వాడకు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. తన తండ్రి అనారోగ్యం దృష్ట్యా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో గురువారం భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణానికి మంత్రి హాజరు కాలేదు. పువ్వాడ నాగేశ్వరరావుకు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు పువ్వాడ ఉదరు కుమార్ అనారోగ్య సమస్యలతో గతంలో మృతి చెందారు. ద్వితీయ కుమారుడైన అజయ్ కుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు.