Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితులను పట్టుకోవడంలో పోలీసుల తాత్సారం సరికాదు : దళిత బహుజనఫ్రంట్, మానవ హక్కుల వేదిక నిజనిర్ధారణ బృందం
నవతెలంగాణ-గుమ్మడిదల
వైరు దొంగతనం చేశాడని ఒక దళితుడిని రాత్రంతా చిత్రహింసలకు గురిచేసి కరెంట్ షాక్ పెట్టి చంపడం అమానవీయమని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, రాష్ర కార్యదర్శి పులి కల్పన, మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి షేక్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో ఇటీవల దొంగతనం నెపంతో బేగ బుడగ జంగంకు చెందిన దళితుడైన మల్లేష్‌ను హత్య చేసిన ఘటనపై గురువారం డీబీఎఫ్, హెచ్అర్ఎఫ్ నిజ నిర్ధారణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మల్లేష్‌ను గత శనివారం అర్ధరాత్రి పొలం దగ్గర కొంతమంది రైతులు పట్టుకొని చిత్రహింసలకు గురి చేస్తూ.. జాతీయ రహదారిపై ఒక భవనం ఎదుట 40 మందికి పైగా మూకుమ్మడిగా దాడి చేశారని తెలిపారు. అంతేకాకుండా భవనం ఎదుట ఉన్న చెట్టుకు కట్టేసి కొట్టి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్యపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినప్పటికీ నిందితులను అరెస్ట్ చేయడంలో తాత్సారం ప్రదర్శించడం తగదన్నారు. తక్షణమే వారిని అరెస్ట్ చేసి శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని పోలీసులను కోరారు. అలాగే, బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధకచట్టం ప్రకారం రూ8.25 లక్షల నష్టపరిహారాన్ని వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.