Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మందుల ధరలు పెంపు దారుణం : వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజల ప్రాణాలు కాపాడే ఔషధాల ధరలను 12 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి హరీశ్‌రావు విమర్శించారు. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేసే చర్య అని ఒక ప్రకటనలో తెలిపారు. జ్వరం, ఇన్ఫెక్షన్లు, బీపీ, చర్మ వ్యాధులు, ఎనీమియా తదితర చికిత్సల్లో వినియోగించే మందులతో పాటు పెయిన్ కిల్లర్లు, యాంటీ బయోటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి 800 పైగా నిత్యావసర మందుల ధరలు పెరిగితే.. అది పేద, మధ్య తరగతి ప్రజలకి భారం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రకంగా సామాన్యుడిని ఇబ్బంది పెట్టడమే బీజేపీ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నదని తెలిపారు. అవకాశం దొరికిన ప్రతిసారీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నదనీ, చివరకు జబ్బు చేస్తే ప్రాణాలు కాపాడే మందుల ధరలు కూడా పెంచేందుకు సిద్దమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్యని విమర్శించారు. ఇవి అచ్ఛే దిన్ కాదు.. సామాన్యుడు చచ్చే దిన్..అని విమర్శించారు. దేశంలో బీజేపీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని ఈ సందర్భంగా హరీశ్ హెచ్చరించారు.