Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాయితీల్లో కోత విధింపు
- రద్దీ వేళల్లో డిస్కౌంట్ ఎత్తేస్తూ ఎల్అంట్డీ నిర్ణయం
- నాన్ పీక్ అవర్స్‌లో అమలు చేయనున్నట్టు ప్రకటన
- సూపర్ సేవర్ ఆఫర్ కొనసాగిస్తూనే.. రూ.100కి పెంపు
- నేటి నుంచి అమలులోకి వస్తుందని అధికారుల ప్రకటన
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ సిటీజనులు హైదరాబాద్ మెట్రో రైల్ గట్టి షాకిచ్చింది. నేటి నుంచి మెట్రో ప్రయాణికులకు రాయితీల్లో కోత విధించింది. రద్దీ వేళల్లో డిస్కౌంట్ ఎత్తేస్తున్నట్టు ఎల్అండ్టీ మెట్రో హైదరాబాద్ అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఆఫ్ పీక్ అవర్స్‌లో ఉదయం 6 గంటల నుంచి 8గంటల వరకు, రాత్రి 8గంటల నుంచి 12గంటల వరకు మాత్రమే కాంటాక్ట్ లెస్ స్మార్ట్‌కార్డుల (సీఎస్సీ)పై 10శాతం రాయితీ ఉంటుందని తెలిపారు. నగరంలోని నాగోల్- రాయదుర్గం, ఎల్బీనగర్- మియాపూర్, జేబీఎస్-ఎంజీబీఎస్ మూడు కారిడార్లలోని 57 స్టేషన్ల గుండా ప్రతిరోజూ వెయ్యికిపైగా మెట్రో సర్వీసులు నడుస్తుండగా.. 4.4లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 11.15గంటల వరకు నడుస్తున్న రైళ్లలో ఎప్పుడూ రద్దీ కని పిస్తూ ఉంటుంది. కాలేజీ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు మొదలు కుని వివిధ తరగతుల ప్రజలు మెట్రో రైళ్లను విని యోగిం చుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో మెట్రో రైళ్లలో ప్రయా ణించే వారి సంఖ్య లక్షలోపే ఉండేది. కరోనా కట్ట డిలో భాగంగా మెట్రో అధికారులు తీసుకున్న భద్రత చర్య లతో క్రమంగా ప్రయాణికుల సంఖ్య మూడింతలు పెరి గింది.
సూపర్ సేవర్ ఆఫర్‌కు ఆదరణ..
ప్రస్తుతం మెట్రో ప్రయాణికులకు అందుబాటులో ఉన్న సూపర్ సేవర్ ఆఫర్-59కు విపరీతమైన ఆదరణ లభించింది. ఈ సూపర్ సేవర్ ఆఫర్ ద్వారా 1.3 మిలియన్స్ ప్రయాణికులు రాకపోకలు చేస్తున్నారు. ఈ ఆఫర్ మార్చి 31తో ముగిస్తుందని మెట్రో అధికారులు తెలిపారు. సూపర్ సేవర్ ఆఫర్-59 స్థానంలో 99 ఆఫర్‌ను తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. ఇది నేటి నుంచి 2024 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. గతేడాది ఉగాది పండుగను పురస్కరించుకుని మెట్రో ప్రయాణికులకు ఈ ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రూ.59 చెల్లించి రిచార్జీ చేయించుకుంటే ఏదైనా సెలవు రోజుల్లో (ఒక రోజు మాత్రమే) రైళ్లలో ఉచితంగా తిరిగే అవకాశాన్ని కల్పించారు. దీంతో చాలామంది వాటిని వినియోగించుకున్నారు. అయితే నష్టాలను అధిగమించడంలో భాగంగా ఎల్అండ్టీ మెట్రో హైదరాబాద్ అధికారులు తాజాగా రూ.59 కార్డును రూ.99కి పెంచారు. ఈ కార్డు నోటిఫైడ్ హాలీడేస్ (శని, ఆదివారాలతోపాటు ప్రభుత్వ సెలవు రోజుల్లో) అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. కాగా, గతంలో రూ.59తో కార్డు తీసుకున్న వారు సూపర్ సేవర్ కింద మెట్రో స్టేషన్లలో రూ.99 వెచ్చించి రిచార్జీ చేసుకోవచ్చని, కొత్తగా ఈ కార్డును తీసుకునేవారు మాత్రం రూ.100 చెల్లించి పొందాల్సి ఉంటుందని సూచించారు.
ఇదిలా ఉండగా, రద్దీ వేళల్లో డిస్కౌంట్‌ను పూర్తిగా ఎత్తేశారు. గతంలో మెట్రో కార్డు, క్యూఆర్ కోడ్‌పై ప్రతి ప్రయాణ చార్జీలో 10శాతం డిస్కౌంట్ ఉండేది. అయితే, దీనిని రోజంతా కాకుండా ఉదయం 6 నుంచి 8గంటల వరకు.. రాత్రి 8 నుంచి 12గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నట్టు వెల్లడించారు. ఇదిలావుంటే.. ఆఫ్ పీక్ అవర్స్‌లో భాగంగా కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డ్స్(సీఎస్సీ)లపై 10 శాతం రాయితీ ఉంటుందని తెలిపారు. మరోవైపు మెట్రో రైళ్లలో ఇప్పటివరకు కల్పించిన రాయితీ విధానంలో కోత విధిస్తుండటంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ రహిత, సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణం అందిస్తున్న తరుణంలో రాయితీలు ఎత్తేయడంపై సామాన్య, మధ్య తరగతి ప్రజలు మెట్రో ప్రయాణాలకు దూరమయ్యే అవకాశం ఉందని, మెట్రో కార్డు, క్యూఆర్ కోడ్‌పై యథావిధిగా పది శాతం డిస్కౌంట్ కొనసాగించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.