Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం
నవతెలంగాణ-కల్చరల్
తెలంగాణ ప్రాంతంలో ఎన్నో గ్రామీణ కళలు వున్నాయనీ, వాటిలో అనేకం కాలక్రమంలో మరుగున పడుతున్నాయని బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. అలాంటి కళలను పరిరక్షించేలా తెలుగు విశ్వవిద్యాలయం అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అక్కడి ఎన్టీఆర్ కళామందిరంలో 2020 సంవత్సరంలో వివిధ కళాత్మక రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రతిభావంతులకు పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిధిగా బుర్రా వెంకటేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో తెలుగు భాషా సంస్కృతిని గ్రామీణులే కాపాడుతున్నారని అన్నారు. మరుగున పడుతున్న కళల అధ్యయన కేంద్రం ఏర్పాటు చేసి, సంవత్సరం అంతా ప్రదర్శనలు నిర్వహిస్తే బీసీ సంక్షేమ శాఖ నుంచి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య కిషన్‌రావు మాట్లాడుతూ గ్రామీణ దళిత యువత లలిత కళలపై ఆసక్తి కనపరుస్తున్నదని వివరించారు. అనంతరం రూ.20,116 నగదు పురస్కారంతో పత్రికా రంగంలో డి. సాయిబాబా, నాట్యరంగంలో రామలింగశాస్త్రి, జానపద కళారంగం నుంచి బ్రహ్మయ్య, గోపాలకష్ణసాయి, అవధాన ప్రక్రియ నుంచి శివరామ కష్ణశర్మ, కథా ప్రక్రియ నుంచి విహారి, విమర్శ ప్రక్రియలో ఎల్ రామచంద్ర, కవిత ప్రక్రియలో డాక్టర్ వై.రామకష్ణారావు, శిల్పం ప్రక్రియ నుంచి రమణారెడ్డి, చిత్ర లేఖనంలో సాజుద్దీన్ అమర్లను సత్కరించారు.