Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.2,710 కోట్ల రుణప్రణాళిక
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో పేదల పాలిట పెన్నిధిగా పనిచేస్తున్న స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్య దేశానికే ఆదర్శమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.2,710 కోట్ల రుణప్రణాళిక రూపొందించామని తెలిపారు. స్త్రీ నిధి పరపతి సహకార సమాఖ్య పదో సర్వసభ్య సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్పారామంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ ఏడాది 1.59 లక్షల సంఘాలలోని 5.30 లక్షల సంఘ సభ్యులు శ్రీనిధి నుంచి రుణాలు పొందారని చెప్పారు. స్త్రీ నిధి రుణాల నిలువ రూ.5,355 కోట్లు చేరిందన్నారు. రుణాల నిలువలో 28.20 శాతం వృద్ధి సాధించటం పట్ల అభినందనలు తెలిపారు. మండల సమాఖ్య కాలపరిమితిని మూడేండ్లకు పెంచేందుకు జనరల్ బాడీ తీర్మానం చేయాలని ఎమ్‌డీని కోరారు. సభ్యులకు ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పథకం అమలునూ పరిశీలించాలని సూచించారు. స్త్రీనిధి రాష్ట్రంలో పేద మహిళల ఆర్ధిక అభ్యున్నతిలో కీలకపాత్ర పోషిస్తున్నదన్నారు. ప్రతి మహిళా తాను తీసుకున్న రుణాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకుని లభించే ఆదాయంలో నుంచి క్రమం తప్పకుండా అప్పు వాయిదాలు చెల్లించి స్త్రీనిధి సంస్థ అభివృద్ధికి దోహదపడాలన్నారు. సభ్యులపై వడ్డీ భారాన్ని తగ్గించేందుకు స్త్రీనిధి రుణాలపై వడ్డీని క్రమంగా 14 శాతం నుంచి 11 శాతానికి తగ్గించామని చెప్పారు. స్త్రీనిధి పేద మహిళలకు కావాల్సిన రుణాలను అందించడమే కాకుండా వారికి ''స్త్రీనిధి సురక్ష పథకం'' ద్వారా ఆర్ధిక రక్షణ కల్పిస్తుందని చెప్పారు. ఒకవేళ రుణం తీసుకున్న సభ్యురాలు మరణించినట్లయితే తీసుకున్న అప్పులో నిల్వ మొత్తాన్ని రద్దుచేసి సభ్యురాలు అంతవరకు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో 1030 బ్యాంక్ కరస్పాండెంట్ కేంద్రాలను సభ్యులు నిర్వహిస్తూ సగటున నెలకు రూ. 12 వేల ఆదాయం పొందుతున్నారని చెప్పారు. కొన్ని మండల సమాఖ్యలనో, మహిళా సంఘాలనో ఎంచుకొని వారు పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి కోటి రూపాయలైనా రుణాలివ్వడానికి స్త్రీనిధి కషి చేయాలన్నారు. సీతాఫలాలు, మామిడిపండ్లు, మిర్చి, పసుపు మొదలైనవి సేకరించి ఉత్పత్తులను తయారు చేస్తున్నామనీ, వాటిని మార్కెటింగ్‌కి మల్టినేషనల్ కంపెనీలతో ఒప్పందలు కుదుర్చుకున్నామని తెలిపారు. స్త్రీ నిధి కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన సెర్ప్, మెప్మా, డీఆర్డీఓ, పీడీ, ఇతర సిబ్బందిని, మహిళా సంఘాల సభ్యులకు అవార్డులను ప్రదానం చేశారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి, సెర్ప్ సీఈవో సందీప్ కుమార్ సుల్తానియా, మున్సిపల్ డైరెక్టర్ సత్యనారాయణ, శ్రీనిధి రాష్ట్ర అధ్యక్షులు ఇందిరా, వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ, ఏపీ మాస్ అధ్యక్షులు సీఎస్.రెడ్డి, శ్రీనిధి ఎమ్డీ విద్యాసాగర్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాఘవ దేవి, కోశాధికారి సరస్వతి, మేనేజింగ్ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.