Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూసైడ్ నోట్ రాసి మెడికో స్టూడెంట్ ఆత్మహత్య
- నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ఘటన
నవతెలంగాణ-కంఠేశ్వర్
'అమ్మనాన్న.. అన్నయ్య క్షమించండి. ఫార్మా పేపర్ 1కు ముందే ఇలా చేద్దామనుకున్నా. కానీ తోటి మిత్రులు, మేడం డిస్టర్బ్ అవుతారని చేసుకోలే. సాయి నువ్వు యూఎస్ నుంచి వచ్చి ఇక్కడే ఉండూ' అంటూ మెసేజ్ పెట్టి మెడికల్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ మెడికల్ కాలేజీలో శుక్రవారం తెల్లవారు జామున జరిగింది. పోలీసులు, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఎం. సనత్ నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ ఫైనల్ పరీక్షలు వారం కిందట పూర్తి కాగా శనివారం నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున 3.11 గంటల సమయంలో కుటుంబీకులకు ఫోన్ నుంచి మెసేజ్ పెట్టి రూమ్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని విగతజీవిగా ఉన్న కొడుకును చూసి బోరున విలపించారు. తోటి మెడికో మృతి పట్ల ఇతర స్టూడెంట్స్ కన్నీరుమున్నీరయ్యారు. జనవరి నెలలో ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలానికి చెందిన ఫైనల్ ఇయర్ విద్యార్థి దాసరి హర్ష సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన నుంచి విద్యార్థులు తేరుకోకముందే తాజాగా సనత్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఒకటో టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ఒత్తిడికి గురై ఉండొచ్చు - కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిర
సనత్ ఆత్మహత్యకు ఒత్తిడే కారణంగా భావిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిర తెలిపారు. మెడికల్ కాలేజీ వద్ద మీడియాతో మాట్లాడారు. సనత్ వారం కిందతే థియరీ పరీక్షలు రాశాడని, నేటి నుంచి ప్రాక్టికల్స్ పరీక్షలు ఉన్నాయని, పరీక్షల ఒత్తిళ్ల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టుగా భావిస్తున్నట్టు తెలిపారు.
వైద్యశాఖ మంత్రితో కమిటీ వేయించాలి - ఎస్ఎఫ్ఐ
మెడికల్ విద్యార్థి సనత్ ఆత్మహత్య విచారకరమని, వైద్యశాఖ మంత్రి స్పందించి కమిటీ వేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేశ్ డిమాండ్ చేశారు. మెడలో స్టెతస్కోప్ వేసుకోవాల్సిన వైద్యవిద్యార్థులు ఉరితాళ్లు బిగించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాల ఆత్మహత్యకు నిలయంగా మారుతోందని, వాటి నివారణకు విద్యార్థులకు ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరారు.