Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కంటే అభివృద్ధిలో మనమే టాప్
- దీనిపై చర్చకు బీజేపీ నాయకులు సిద్ధమా..?: ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
- గ్రామపంచాయతీలకు అవార్డుల ప్రదానం
నవతెలంగాణ-రాజేంద్రనగర్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా శత్రుదేశంగా చూస్తోందని రాష్ట్ర అభివృద్ధికి ఏ మాత్రం సహకరించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నదని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ హాజరై మాట్లాడారు. గ్రామీణాభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశంలోని ఏ రాష్ట్రంలో జరగడం లేదని తెలిపారు. దేశంలో 20 ఉత్తమ గ్రామ పంచాయతీల్లో 19 తెలంగాణ నుంచి ఉండటం గొప్ప విషయమన్నారు. ఈ ఘనత సర్పంచులు, కార్యదర్శులు, వార్డు మెంబర్లకే దక్కుతుందని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న గ్రామీణాభివృద్ధిపై, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న గ్రామీణ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. స్వచ్ఛ సర్వేక్షన్లో రాష్ట్రంలోని 27 మున్సిపాలిటీలకు అవార్డులు వచ్చాయని తెలిపారు. కరోనా వల్ల రాష్ట్రానికి రూ.లక్ష కోట్ల నష్టం వచ్చినా ఇక్కడ సంక్షేమ పథకాలు ఆగకుండా ముందుకు సాగుతున్నాయని స్పష్టం చేశారు. గ్రామస్థాయిలో సర్పంచులకు కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని, త్వరలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు. గ్రామస్థాయిలో పెండింగ్లో ఉన్న రూ.1300 కోట్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఉన్న తలసరి ఆదాయం కంటే ప్రస్తుతం రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని తెలిపారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు జిల్లా కేంద్రంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సీఎం కేసీఆర్ మొదటి సారి ఎమ్మెల్యే అయిన తర్వాత రాజేంద్రనగర్లోని ఎన్ఐఆర్టీలో గ్రామీణాభివృద్ధిపై శిక్షణ తీసుకున్నారని గుర్తు చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. రాష్ట్రం రాకముందు గ్రామాల్లో సర్పంచుల పరిస్థితి ఘోరంగా ఉండేదని, సీఎం కేసీఆర్ దూర దృష్టితో చిన్న, చిన్న తండాలను కూడా గ్రామపంచాయతీలుగా చేశారని గుర్తు చేశారు. 14, 15వ ఆర్థిక ప్రణాళికా సంఘంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డుల్లో మొదట 100కు 99 అవార్డులు తెలంగాణకే వస్తే.. బీజేపీ ప్రభుత్వం కుట్ర చేసి వాటిని తగ్గించిందన్నారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకుండా వివక్ష చూపుతోందన్నారు. ఈ అవార్డులు రావడానికి ఎంతో శ్రమించిన సర్పంచులు, కార్యదర్శులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు అభినందనలు తెలిపారు. అనంతరం 'పల్లె ప్రగతి' పుస్తకాన్ని ఆవిష్కరించారు. జాతీయ ఉత్తమ పంచాయతీలకు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఐఏఎస్లు హనుమంతరావు, రఘునందన్ రావు, రాష్ట్రంలోని డిప్యూటీ కలెక్టర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.