Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో హడావుడి షురూ...
- ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం
- సీఎం కప్, ఆత్మీయ సమ్మేళనాలతో జనంలోకి గులాబీ పార్టీ
- కర్నాటక జోష్‌తో 'హస్తం'-చేరికలపై ఫోకస్
- మతపరమైన వేడుకలు, యాత్రల్లో కమలం నేతలు బిజీ
- ప్రజా సమస్యలే అజెండాగా వామపక్షాలు
- దృష్టి సారించిన అన్ని పార్టీలు
రాష్ట్ర శాసనసభ ఎన్నికల వేడి క్రమక్రమంగా రాజుకుంటున్నది. అన్ని పార్టీలు ఆ ఎలక్షన్లపై దృష్టి సారించాయి. క్షేత్రస్థాయిలో అందుకనుగుణంగా సన్నాహాలు మొదలుపెట్టాయి. జనంతో మమేకమయ్యేందుకు, తద్వారా ఓటరన్నకు చేరువయ్యేందుకు రకరకాల రూపాల్లో ఇప్పటికే తమ ప్రయత్నాలను ప్రారంభించాయి. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఆరేడు నెలల సమయముంది. కానీ తీరా ఎలక్షన్ నోటిఫకేషన్ వచ్చిన తర్వాత పని మొదలుపెడితే ఫలితం ఉండబోదని భావించిన పార్టీలు, నేతలు గత రెండు మూడు నెలల నుంచే 'గ్రౌండ్ ప్రిపరేషన్'లో తల మునకలయ్యారు. మరోవైపు ప్రజల్లో సైతం ఎలక్షన్ల గురించి చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి.
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎన్నికల సన్నద్ధతలో మిగతా పార్టీలతో పోలిస్తే అధికార 'గులాబీ దళమే' ముందంజలో ఉంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఫిబ్రవరి నుంచే 'ఆత్మీయ సమ్మేళనాల' పేరిట ఆ పార్టీ పని ప్రారంభించింది. గ్రామాలు, మండల కేంద్రాల్లో పార్టీ కార్యకర్తలు, నేతలు, సానుభూతిపరులతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వన భోజనాలు, విందులు, వినోద కార్యక్రమలు నిర్వహించారు. కొత్త కలెక్టరేట్లు, జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యాలయాల ప్రారంభోత్సవాల పేరిట ఫిబ్రవరి, మార్చి నెలల్లో సుడిగాలి పర్యటనలు చేసిన కేసీఆర్... ఆయా వేదికల ద్వారా కేంద్రంలోని బీజేపీపై విమర్శ నాస్త్రాలు సంధించారు. ఆ తర్వాత 125 అడుగుల బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ, నూతన సచివాలయం ప్రారంభోత్సవాల పేరిట ఆయన దేశ రాజకీయాల్లో నానేందుకు ప్రయత్నిం చారు. ఆయా సందర్భాల్లో నిర్వహించిన సభలన్నీ ఎన్నికల సన్నద్ధతల్లో భాగంగానే కొనసాగాయి. మరోవైపు ఆంధ్రా, మహారాష్ట్ర నుంచి చేరికలంటూ ఆ పార్టీ ఇప్పటికే రోజుకో మీటింగ్ నిర్వహిస్తూ 'ఎలక్షన్ ఫీవర్'ను కొనసాగిస్తూ ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని యువతను ఆకర్షించటమే లక్ష్యంగా 'సీఎం కప్' పేరిట గ్రామ,మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆటల పోటీలు నిర్వహణకు రంగం సిద్ధం చేశారు. పైకి చూడటానికి ఇది ప్రభుత్వ కార్యక్రమంగా ఉన్నప్పటికీ... అంతర్గతంగా రాజకీయ పరంగా 'ఎన్నికల కోణమే' కనిపిస్తోంది.
ఇక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్... కర్నాటక అసెంబ్లీ ఫలితాలతో మాంచి జోష్‌లో ఉంది. అక్కడి ఫలితాలు ఇక్కడ కూడా ప్రభావం చూపుతాయంటూ చెబుతున్న ఆ పార్టీ నేతలు... అందుకనుగుణంగా తెలంగాణలో 'హస్తాన్ని' బలోపేతం చేస్తామంటూ చెప్పుకొస్తున్నారు. అందులో భాగంగా వివిధ జిల్లాల్లో పదవులు లేక అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్ నేతలు, అసమ్మతివాదులు, బహిష్కరణకు గురైన వారిపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇటీవల వార్తల్లో ఎక్కువగా నానుతున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటిని తమ వైపు లాక్కునేందుకు పీసీసీ చీఫ్ రేవంత్ చేసిన ప్రయత్నాలు ఫలించినట్టు తెలిసింది. ఆయన జూన్‌లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు వినికిడి. పొంగులేటి హస్తం పార్టీలో చేరితే ఆయన వెంటే... ఉమ్మడి పాలమూరు సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్‌లో చేరతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఏప్రిల్‌లో రేవంత్ నిర్వహించిన 'హాత్ సే హాత్ జోడో...' యాత్ర, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క 'లాంగ్ మార్చ్' పేరిట కొనసాగిస్తున్న పాదయాత్ర కూడా రానున్న ఎన్నికల సన్నద్ధతలో భాగమే.
ఇక రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయినా ఈసారి ఎక్కువ సీట్లు గెలిచేందుకు తహతహలాడుతున్న కమలం పార్టీ... అందులో భాగంగా మత సంబంధిత యాత్రలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు నేతృత్వంలో పలు దఫాలుగా ప్రజా సంగ్రామ యాత్రలను నిర్వహించారు. మరో దఫా కూడా ఆ యాత్రను చేపట్టేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. తాజాగా ఆదివారం కరీంనగర్లో 'హిందూ ఏక్తా యాత్ర'కు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను ఆహ్వానించి హడావుడి చేశారు. వచ్చే ఎన్నికల దాకా ఇదే రకంగా పలు రకాల యాత్రలను నిర్వహించాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనబడుతున్నది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతోపాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షుడిగా ఉన్న బీఎస్పీ, వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్ టీపీ, విశారదన్ మహారాజ్ ప్రకటించిన ధర్మ సమజ్ పార్టీ తమ తమ స్థాయిల్లో యాత్రలు, సభలు, సమావేశాలు నిర్వహించటం ద్వారా ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
పని ప్రారంభించిన ఈసీ...
పార్టీలు, ప్రజల పరిస్థితి ఎలా ఉన్నా... ఎన్నికల ప్రక్రియకు ఎన్నికల సంఘం సమాయతమవుతున్నది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అధికా రులు... హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడి అధి కారులతో భేటీ అయ్యారు. ఈవీఎమ్‌లు, స్ట్రాంగ్ రూములు, ఎలక్షన్ బూత్‌లు, ఓటర్ల నమోదు, ఓట్ల తొలగిం పులు, కొత్త ఓటర్ల నమోదు తదితరాంశాలపై వారు ప్రాథమి కంగా చర్చించారు. ఈ రకంగా రాష్ట్రంలో ఇప్పుడు ప్రారంభ మైన ఎన్నికల జాతర... డిసెంబరు వరకూ కొనసాగనుంది.
పోరాటాలతో వామపక్షాలు...
ఇక రాష్ట్రంలో వామపక్ష పార్టీలైన సీపీఐ (ఎం), సీపీఐ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలతో ముందుకెళుతున్నాయి. పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, పోడు భూముల సమస్యలపై సీపీఐ (ఎం) ఇటీవల అనేక పోరాటాలు నిర్వహించింది. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు విడమరిచి చెప్పేందుకు వీలుగా ఆ పార్టీ మార్చిలో 'జన చైతన్య యాత్ర'ను నిర్వహించింది. ఇదే తరహాలో 'బీజేపీ హఠావో- దేశ్ కీ బచావో' నినాదంతో సీపీఐ ఇంటిటికీ ప్రచారాన్ని ప్రారంభించింది.