Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాపాజ్ : అమెరికా ఎన్ని నీచపుటెత్తుగడలకు పాల్పడినా బొలీవియా స్వతంత్రంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతోంది. వరుసగా మూడు ఎన్నికల నుంచి ప్రజాదరణ పెరుగుతూ వచ్చిన ఎవో మొరేల్స్ను 2019 ఎన్నికల్లో పోటీ చేయకుండా వుండేందుకు అమెరికా చాలా ఒత్తిడి తీసుకువచ్చింది. కానీ ఆ చర్యలు ఆశించిన ఫలితాన్నివ్వడంలో విఫలమయ్యాయి. అమెరికా తోడ్పాడుతో ప్రతిపక్షం 2019 ఎన్నికలను దెబ్బతీయడానికి చాలా ప్రయత్నించింది. ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయనీ, పూర్తి మోసపూరితంగా జరిగాయని ముద్ర వేసేందుకు చాలా కుయుక్తులు పన్నింది. కానీ అందుకు కావాల్సిన వాస్తవిక సాక్ష్యాధారాలు లేకపోవడంతో వారి ప్రయత్నాలు నిష్ఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో మొరేల్స్కు వ్యతిరేకంగా మిలటరీ చర్యలు తీసుకుంది. ఆయన్ని ప్రవాసంలోకి పంపింది. మొరేల్స్ స్థానంలో తాత్కాలిక అధ్యక్షురాలిగా జెనైన్ అనెజ్ను రంగంలోకి దింపింది. వరుసగా ఎంఎఎస్ మద్దతుదారులను ఊచకోత కోయడమే పనిగా పెట్టుకున్న అనెజ్ ప్రభుత్వానికి వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. ప్రజాస్వామ్యబద్ధమైన తమ హక్కులను హరించివేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను బొలీవియన్లు చూస్తూ ఊరుకోలేదు. ప్రభుత్వానికి వ్యతిరకంగా సంఘటితమవడం ఆరంభించారు. ఫలితంగా 2020 ఎన్నికలకు ముందుగా తాను ఎన్నికల బరి నుండి వైదొలగుతున్నట్లు అనెజ్ ప్రకటించారు. ఎంఎఎస్ నేతృత్వంలోని లూయిస్ అరెస్ విజయం సాధించారు. మొరేల్స్ విజయవంతంగా స్వదేశానికి తిరిగివచ్చారు. బొలీవియన్ల ప్రయోజనాలను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఎంఎఎస్ ఎజెండాను అధ్యక్షుడు పునరుద్ధరించారు. అయితే మార్చిలో కుట్రదారులను అరెస్టు చేయడాన్ని బైడెన్ ప్రభుత్వం అంగీకరించలేకపోయింది. బొలీవియా ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తోందని హెచ్చరిస్తూ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఒక ప్రకటన జారీ చేశారు. అయినా సరే కుట్రదారులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాల్సిందేనని బొలీవియా నిర్ణయించింది. అరెస్ ప్రభుత్వం చట్టబద్ధం కాదంటూ చర్యలు తీసుకోవడానికి అమెరికా ప్రభుత్వం పావులు కదుపుతోంది.
అమెరికా ప్రభుత్వం సాగిస్తున్న సమాచార యుద్ధం కారణంగా బొలీవియా వంటి దేశాలు ఉక్కిరిబిక్కిరవకుండా వుండేందుకు మనం బాసటగా నిలబడాల్సి వుందని భారత చరిత్రకారుడు, ఎడిటర్, జర్నలిస్టు విజరు ప్రసాద్ తన పుస్తకంలో పేర్కొన్నారు.