Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసియా దేశాలతో దౌత్య కార్యాచరణ
- మయన్మార్, కొరియా సమస్యల సాకుతో ఆసియా ప్రాంతాన్ని చీల్చేందుకు అమెరికా యత్నాలు
బీజింగ్ : ఆసియా దేశాలు ప్రాంతీయ సవాళ్ళను, విదేశీ ప్రభావాలను ఎదుర్కొంటున్నాయి. ఒకపక్క మయన్మార్‌లో అశాంతి పెచ్చరిల్లుతుంటే, మరోపక్క కొరియా ద్వీపకల్పం అణుసమస్య అమెరికా ఇండో-పసిఫిక్ వ్యూహంతో ప్రభావితమైంది.ఈ దశలో ఆసియా ప్రాంతాన్ని సుస్థిరీకరించే విషయంలో చైనా పోషించే పాత్ర చాలా కీలకమైంది. అమెరికా మిత్ర పక్షాలతో సహా కొన్ని ఆసియా దేశాలు తమ దూతలను బీజింగ్‌కు పంపాయి. చైనాతో సమన్వయంగా వ్యవహరిస్తూ, కీలక సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో పర్యటన తర్వాత చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి గత నెల 22, 23 తేదీల్లో రష్యా విదేశాంగ మంత్రితో భేటీ అయ్యారు. ఇటీవలి కాలంలో చైనా చాలా తరచుగా దౌత్య కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఆసియన్ దేశాలైన ఇండోనేషియా, సింగపూర్, మలేసియా, ఫిలిప్పైన్స్ విదేశాంగ మంత్రులు చైనాలో మూడు రోజుల పాటు పర్యటించారు. శుక్ర, శనివారాల్లో దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి కూడా చైనాలో పర్యటిస్తున్నారు. చైనా చీఫ్ డిప్లొమేట్ యాంగ్ జియిచి ఈ వారంలోనే కంబోడియా, లావోస్, కువైట్ దేశాల రాయబారులతో భేటీ అయ్యారు.
నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను చైనా సవాలు చేస్తోందని, ఆసియా ప్రాంతాన్ని అస్థిరీకరిస్తోందని అమెరికా ఎన్ని వ్యాఖ్యలు, విమర్శలు చేసినా వాటితో నిమిత్తం లేకుండా చాలా ఆసియా దేశాలు ఇప్పటికీ చైనాను ఆసియా ప్రాంతంలో ప్రాముఖ్యత కలిగిన ప్రధాన శక్తిగా గుర్తిస్తున్నాయి. ఇందులో అమెరికా మిత్ర పక్షాలు కూడా వున్నాయి. అలాగే చైనాతో ప్రాదేశిక వివాదాలు కలిగిన దేశాలూ వున్నాయి. ఆసియా ప్రాంతంలో సుస్థిరతకు హామి కల్పిస్తూ, ఆర్థికాభివృద్ధిని పెంపొందించుకునేందుకు ఆ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. కొవిడ్‌పై పోరు, ఆర్థిక పునరుద్ధరణను వేగవంతం చేయడం, అత్యంత నాణ్యతతో బెల్ట్ అండ్ రోడ్ చొరవను అమలు చేయడం, కీలకమైన అంశాలపై ప్రాంతీయ దేశాలన్నీ ఒకే తాటిపై వుండేలా చూడడం, విదేశీ శక్తులు ముఖ్యంగా అమెరికా జోక్యంతో చీలిపోకుండా నివారించడం వంటి కీలకమైన కార్యకలాపాలపై దృష్టి పెట్టి చైనా, ఆసియా దేశాలతో తరచుగా దౌత్య కార్యకలాపాలు నెరుపుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇతర దేశాల అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదన్న సూత్రాలకు కట్టుబడాలని చైనా భావిస్తోందని, మయన్మార్‌లో సుస్థిరత పునరుద్ధరణకు అవసరమైన సాయాన్ని అందించడానికి సిద్ధంగా వుందని చైనా విదేశాంగ మంత్రి ఒక పత్రికా సమావేశంలో తెలిపారు.
సింగపూర్ విదేశాంగ మంత్రి బాలకృష్ణన్‌తో సమావేశమైన వాంగ్, చైనా-ఆసియాన్ సంబంధాల స్థాయిని పెంచడానికి సంయుక్తంగా కృషి చేయాలని నిర్ణయించాయని తెలిపారు. మయన్మార్‌లో పరిస్థితి మరింత దిగజారడానికి విదేశీ శక్తుల జోక్యమే కారణమని చైనా నిపుణుడు లి హైడాంగ్ గ్లోబల్ టైమ్స్‌తో వ్యాఖ్యానించారు. అమెరికా, కొన్ని మిత్ర పక్షాలు మయన్మార్‌లో పరిస్థితిని అధ్వాన స్థాయికి జార్చాలని చూస్తున్నారని విమర్శించారు. ఆసియాన్ దేశాల్లో, ఆసియాన్-చైనా మధ్య మరిన్ని వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు.
ఆసియా ప్రాంతాన్ని స్థిరీకరించే శక్తిగానే చైనా వ్యవహరించడం కాదని, అమెరికా జోక్యం పట్ల, నిగూఢ చర్యల పట్ల కూడా అప్రమత్తంగా వుండాలని ప్రాంతీయ దేశాలను హెచ్చరించాల్సిన అవసరం కూడా ఎంతైనా వుందని లీ అభిప్రాయపడ్డారు. లేని పక్షంలో ఉక్రెయిన్, సిరియా, లిబియాల్లో సంభవించిన విషాదాలే మయన్మార్‌లో, ఆగేయాసియా దేశాల్లో సంభవించే ప్రమాదముందని హెచ్చరించారు.