Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటిలేటర్లు, సిటి స్కానర్లు వంటి వైద్య పరికరాల ఉత్పత్తి
- ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ కూడా రెడీ
హవానా : కొవిడ్ పై సాగుతున్న యుద్ధంలో క్యూబా సాంకేతికపరమైన సార్వభౌమాధికారాన్ని సాధించింది. కొవిడ్ రోగులకు చికిత్సలో అవసరమైన వెంటిలేటర్లు, సిటి స్కానర్లు వంటి వైద్య పరికరాల ఉత్పత్తిలో సాధించిన స్వావలంబన గురించి బయటకు పెద్దగా తెలియదు కానీ, హవానాలోని ఉత్పత్తి కేంద్రాల్లో బుధవారం అధికారుల పర్యటన సందర్భంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి పరికరాలను దిగుమతి చేసుకోవడానికి ఇతర దేశాలు ఇబ్బందులు పడుతుండగా, క్యూబా మాత్రం డబ్బును ఆదా చేయడానికి, కొవిడ్ మరణాల రేటును తగ్గించడానికి కృషి చేసి ఫలితాలు సాధించింది. ప్రభుత్వ బయో ఫార్మాస్యూటికల్ కార్పొరేషన్ బయో క్యూబా ఫార్మా అధిపతి ఎడ్వర్డో మార్టినెజ్ మాట్లాడుతూ, తమ దేశం డబ్బును ఆదా చేసిందని చెప్పారు. తాము సాధించిన సార్వభౌమాధికార ఫలితాల వల్ల లక్షలాది డాలర్లు పొదుపు చేయగలిగామన్నారు. దశాబ్దాల తరబడి అమెరికా వాణిజ్య ఆంక్షలు ఎదుర్కొంటూ కూడా క్యూబా ఈ విజయాన్ని సాధించింది. వైద్య పరికరాల దిగుమతిని అడ్డం కొట్టేలా ట్రంప్ హయాంలో ఆంక్షలు మరింత కఠినతరమాయ్యయి. బుధవారం నాడు క్యూబాలో రికార్డు స్థాయిలో 1051 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 75వేలకు పైగా కేసులు నమోదు కాగా 424 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు కరోనాను ఎదుర్కొనడానికి 10కోట్ల డాలర్లను ఖర్చు పెట్టినట్లు క్యూబా గతేడాది చివరిలో వెల్లడించింది. ఆహారం, మందులు వంటి మౌలికావసరాలే కొరవడుతున్న పరిస్థితుల్లో ఇది మరింత భారమైనా విజయవంతంగా ఎదుర్కొంది. దేశీయంగా అభివృద్ధిపరుస్తున్న కరోనా వ్యాక్సిన్ ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్‌లో వుంది. అది కూడా పూర్తయితే ఔషధ రంగంలో మరో విజయం సాధించినట్లే కాగలదు. ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు సంతృప్తికరంగానే వున్నాయని మార్టినెజ్ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివరి నాటికి తమ దేశ ప్రజలకు ఈ వ్యాక్సిన్ అందించగలమని ఆశిస్తున్నట్లు చెప్పారు.