Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాంత్రీకరణ భయాలు..
- వచ్చే ఐదేండ్లలో 40 శాతం మందికి ఉద్వాసన
- ప్రమాదంలో కోట్ల మంది ఉపాధి : ప్రపంచ ఆర్థిక ఫోరమ్ రిపోర్ట్
జెనీవా : కరోనా దెబ్బకు ఇప్పటికే కోట్లాది మంది ఉపాధి ప్రమాదంలో పడగా.. తాజాగా ప్రపంచ ఆర్థిక ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) మరో బాంబు పేల్చింది. యాంత్రీకరణ, కృత్రిమ నైపుణ్యత వల్ల వచ్చే ఐదేండ్ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా భారీగా ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉన్నదని ఓ సర్వేలో వెల్లడించింది. 60 శాతం ఉద్యోగులు అభద్రతలో ఉన్నారని తేలింది. వచ్చే 2025 నాటికి పని ప్రదేశంలో మానవ వనరులు, యంత్రాల పని సమాన వ్యయానికి చేరొచ్చని అంచనా వేసింది. కన్సల్టింగ్ సంస్థ పీడబ్ల్యూసీతో కలిసి 19 దేశాల్లో 32 వేల కార్మికుల అభిప్రాయాలను సేకరించి డబ్ల్యూఈఎఫ్ ఈ రిపోర్ట్‌ను తయారు చేసినట్టు వెల్లడించింది. ఆ వివరాలు.. వచ్చే ఐదేండ్ల్లలో తమ ఉద్యోగాలు పోవచ్చని 40 శాతం మంది కార్మికులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. దీర్ఘకాలంలో తమ ఉద్యోగ భద్రత పట్ల 56 శాతం మంది భయందోళనలో ఉన్నారు. దాదాపుగా 60 శాతం పైగా మంది తమ ఉద్యోగాలకు ప్రభుత్వాలు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో 40 శాతం మంది ఉద్యోగులు తమ డిజిటల్ నైపుణ్యాలను పెంచుకున్నారు. ఇదే సమయంలో 77 శాతం మంది నూతన నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఆసక్తిని కనబర్చారు. మరోవైపు 80 శాతం మంది నూతన టెక్నాలజీని అందిపుచ్చుకునే సామర్థ్యం, విశ్వాసం ఉందని తెలిపారు. డబ్ల్యూఈఎఫ్ రిపోర్ట్ ప్రకారం.. యంత్రీకరణ, కృత్రిమ నైపుణ్యం పెరగడంతో 8.5 కోట్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఈ రంగంలో కొత్తగా 9.7 కోట్ల ఉద్యోగాలు సృష్టించబడే అవకాశం ఉందని పేర్కొంది.